తానంటే అధికార పక్షం భయపడిపోతోందని, ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు భయపడిపోతూ ఉన్నారని అంటున్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ నారా లోకేష్. ఈ సందర్భంగా నారా లోకేష్ తన ధీరోదత్తత గురించి రాసుకొచ్చారు. తను ఎమ్మెల్యేగా నెగ్గలేకపోవడం చాలా చిన్న విషయం అని లోకేష్ అన్నాడు. అలాగే తనకు తెలుగు రాకపోవడం కూడా పెద్దవిషయం కాదన్నాడు. దాని వల్ల రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు వెనక్కుపోలేదని, పోలవరం ఆగిపోలేదని లోకేష్ చెప్పుకొచ్చారు!
అయినా ఈయన గారి తెలుగుకూ పోలవరం ప్రాజెక్టుకు ఏం సంబంధమో! ఇలాంటి పోలికలు పెట్టే లోకేష్ కామెడీ అయిపోతూ ఉంటారు. అది తన జన్మహక్కు అన్నట్టుగా లోకేష్ తనకు అధికార పార్టీ భయపడిపోతూ ఉందని చెప్పుకురావడం మరో హాస్యాస్పదం అయిపోతుంది. రాజకీయాల్లో ఎవ్వరూ ఎవ్వరికీ భయపడరు. ఎవరి అవకాశాలను వారు చూసుకుంటూ ఉంటారు ప్రతి విషయంలోనూ!
కనీసం ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయినా లోకేష్, పవన్ కల్యాణ్ లు దర్జాగా మాట్లాడుతూ ఉన్నారు. అంతని ఇంతని కనీసం ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయిన వీళ్లే భయపడనప్పుడు అధికార పార్టీ వాళ్లు లోకేష్ ను చూసి ఎందుకు భయపడతారో ఆయనకే తెలియాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు తన ప్రస్తావన తెస్తున్నది భయపడి కాదని, వ్యంగ్యంగా అని, ఎద్దేవా చేయడానికి అని లోకేష్ అర్థం చేసుకోలేకపోతున్నారా? అర్థం కానట్టుగా నటిస్తున్నారా?
ఏదేమైనా తండ్రి బీభత్సమైన బ్యాక్ గ్రౌండ్ ను పెట్టుకుని.. కనీసం ఎమ్మెల్యేగా నెగ్గలేక.. ఇప్పటికే రాజకీయంగా హాస్యాస్పదమైన విమర్శలకు గురి అవుతూ ఉన్న లోకేష్ బాబు.. 'నేనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఎంత భయం?' అని ప్రశ్నించడం మరింత కామెడీగా మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి సెల్ఫ్ కౌంటర్లు ఇచ్చుకోవడం లోకేష్ కు బాగా అలవాటుగా మారినట్టుంది.