బూతులు మాట్లాడ్డంలో పాలకప్రతిపక్ష పార్టీలు వైసీపీ, టీడీపీ దొందు దొందే. ఈ విషయంలో అధినేతలకు పక్కా క్లారిటీ ఉంది. అయితే సమస్యల్లా ప్రతిపక్ష పార్టీల నేతలపై కేసులు పెట్టడమే. దీన్ని టీడీపీ భవిష్యత్ రథసారథి నారా లోకేశ్ ప్రశ్నిస్తున్నారు. ఏం వైసీపీ బూతులు మాట్లాడితే వినసొంపుగా ఉన్నాయా? అని పోలీసులను నిలదీస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. తద్వారా తమ పార్టీ నేతలు కూడా బూతులు మాట్లాడుతున్నారని ఆయన పరోక్షంగా అంగీకరించినట్టైంది.
అసలు ఆ సంస్కృతికి వ్యతిరేకంగా ఇరు పార్టీల ముఖ్య నాయకులు చొరవ చూపడానికి బదులు ప్రోత్సహిస్తుండడం పౌర సమాజాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ముందు బూతులు స్టార్ట్ చేసిన వాళ్లే నిలుపుదల చేయాలని ఒకరిపై మరొకరు పంతాలకు పోతున్నారు. దీంతో యథేచ్ఛగా బూతులు మాట్లాడ్డం పెరుగుతోంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ నాయకుడు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అయ్యన్నపాత్రుడికి సీఆర్పీసీలోని సెక్షన్ 41 ఎ ప్రకారం నోటీసులు ఇచ్చేందుకు ఆ జిల్లా పోలీసులు విశాఖ జిల్లాలోని అయ్యన్న పాత్రుడి ఇంటికెళ్లారు.
అయితే ఆ సమయానికి అయ్యన్నపాత్రుడు ఇంట్లో లేనట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అయ్యన్నకు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన నేపథ్యంలో లోకేశ్ స్పందించారు. అయ్యన్నపాత్రుడు వాస్తవాలు మాట్లాడితేనే కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్లారన్నారు. మరి వైసీపీ నేతల బూతులు పోలీసులకు వినసొంపుగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ నేతల బూతులపై కేసులు పెడితే కనీసం స్పందించని పోలీసులు, జిల్లాలు దాటి మరీ టీడీపీ నేతలను అరెస్ట్ చేయడానికి వస్తున్నారని లోకేశ్ మండిపడ్డారు. ఇదే రాజారెడ్డి రాజ్యాంగం ప్రత్యేకత లోకేశ్ తన మార్క్ వ్యంగ్యాన్ని ప్రదర్శించారు.