ఏకోపాధ్యాయ పాఠశాలల గురించి మనం వింటూనే ఉన్నా. 100మంది పిల్లలకు ఒకరే టీచర్, 150మంది స్టూడెంట్స్ కి ఒక్కరే మాస్టారు.. అంటూ ప్రభుత్వ ఉదాసీన వైఖరిని ఖండిస్తూ మన దగ్గర చాలా వార్తలే వస్తుంటాయి. కానీ మహారాష్ట్రలో ఓ విచిత్రమైన పరిస్థితి. మహారాష్ట్రలోని గణేష్ పూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ స్కూల్ లో రెండేళ్లుగా ఒకరే టీచర్, ఒకరే స్టూడెంట్.
ఆ ఒక్క పిల్లాడికి పాఠాలు చెప్పేందుకే ఆయన స్కూల్ కి వస్తాడు. టీచర్ సెలవు పెడితే పిల్లవాడికి కూడా శెలవు. పిల్లవాడికి ఒంట్లో నలతగా ఉండి స్కూల్ కి రాకపోతే ఆరోజు టీచర్ కి రెస్ట్ దొరికినట్టే. ఇదీ అక్కడ రెండేళ్లుగా జరుగుతున్న తంతు.
150 మంది జనాభా ఉన్న గణేష్ పూర్ లో ఒకే ఒక ప్రభుత్వ స్కూల్ ఉంది ఆ స్కూల్ లో కూడా ఒకే ఒక స్టూడెంట్ చదువుకుంటున్నాడు. ఆ స్టూడెంట్ కి కిషోర్ మన్కర్ అనే ఉపాధ్యాయుడు మాత్రమే రోజూ వచ్చి పాఠాలు చెబుతుంటారు. విచిత్రం ఏంటంటే.. ఉదయాన్నే అక్కడ ప్రేయర్ కూడా జరుపుతారు. వందేమాతరం, జనగణమన అన్నీ ఆ ఒక్క విద్యార్థే ఆలపిస్తాడు. స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజు కూడా అక్కడ జెండా ఎగరేస్తారు. ఆ ఒక్క స్టూడెంట్, ఆయనకున్న ఏకైక మాస్టారు.. వారిద్దరే జెండా వందనంలో పాల్గొంటారు.
మిడ్ డే మీల్స్ కూడా..
ఒకరే టీచర్, ఒకరే స్టూడెంట్ ఉన్న ఆ స్కూల్ మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉంటే.. ఈ పాటికే పక్క ఊరికి మార్చేసి ఉండేవారు. కానీ మహారాష్ట్ర సర్కారు మాత్రం ఆ స్కూల్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గణేష్ పూర్ లో స్కూల్ మూసివేయకూడదనే ఉద్దేశంతో.. వసీం జిల్లా అధికారులు రెండేళ్లుగా ఆ స్కూల్ ని సజావుగానే రన్ చేస్తున్నారు. ఆ ఒక్క స్టూడెంట్ కి మధ్యాహ్నం ఉచితంగా భోజనం కూడా అందిస్తారు. మిడ్ డే మీల్స్ కార్యక్రమం కూడా సమర్థంగా చేపట్టామని, ఎప్పటికైనా ఆ ఊరిలో మరికొంతమంది పిల్లలు ఆ స్కూల్ కి వస్తారని నమ్మకంగా చెబుతున్నారు అధికారులు.