Advertisement

Advertisement


Home > Politics - National

సీన్ రిపీట్: తోటి పాసింజర్ పై మూత్ర విసర్జన

సీన్ రిపీట్: తోటి పాసింజర్ పై మూత్ర విసర్జన

ఎయిరిండియా పీ-గేట్ వివాదం ఇంకా ముగియకముందే, యాజ్ ఇటీజ్ అలాంటి ఘటనే రిపీటైంది. ఈసారి అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానంలో ఈ ఘటన జరిగింది. ఎయిర్ లైన్స్ పేరు మారినా ఆ పాడు పని చేసింది ఈసారి కూడా భారతీయుడే.

న్యూయార్క్-న్యూఢిల్లీ అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానంలో ఆర్య వోహ్రా అనే వ్యక్తి, తన సహ-ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. ఇతడు ఢిల్లీ డిఫెన్స్ కాలనీకి చెందిన వ్యక్తి.

అమెరికన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఏఏ292 అనే విమానం న్యూయార్క్ నుంచి బయల్దేరి, 14 గంటలు ప్రయాణించి ఢిల్లీలో ల్యాండ్ అయింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మద్యం మత్తులో ఉన్న ఆర్య వోహ్రా, తన తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు.

ఊహించని ఘటనతో తోటి ప్రయాణికుడు బిత్తరపోయాడు. వెంటనే విమానంలో సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. మత్తు దిగిన తర్వాత ఆర్యకు తప్పు తెలిసొచ్చింది. పోలీస్ కేసు పడితే తన కెరీర్ నాశనం అవుతుందని, బాధితుడి కాళ్లవేళ్ల పడ్డాడు. దీంతో బాధితుడు పోలీస్ కేసు వరకు వెళ్లలేదు.

అయితే బాధితుడు వెనక్కి తగ్గినా, విమానయాన సిబ్బంది మాత్రం ఊరుకోలేదు. వెంటనే ఢిల్లీ విమానాశ్రయ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో విమానం ల్యాండ్ అయిన వెంటనే ఆర్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతడిపై కేసు నమోదు చేశారు.

మరోవైపు అమెరికన్ ఎయిర్ లైన్స్ కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. భవిష్యత్తులో ఆర్య తమ ఎయిర్ లైన్స్ లో ప్రయాణించకుండా నిషేధం విధించింది. 21 ఏళ్ల ఆర్య అమెరికాలోని ఓ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. ఆ యూనివర్సిటీ కూడా ఆర్యపై చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలిస్తోంది.

తాజా ఘటనతో విమాన ప్రయాణికులకు మద్యం అందించే పాలసీపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ పాలసీని ఇప్పటికే ఎయిరిండియా సవరించింది. పరిమితంగానే మద్యం అందించాలని నిర్ణయించుకుంది. ఇకపై మిగతా ఎయిర్ లైన్స్ కూడా భారతీయ పాసింజర్లకు మద్యం అందించే విషయంలో పరిమితులు విధిస్తాయేమో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?