ఆంధ్రప్రదేశ్ లో పురుషులు జోరుమీదున్నారు. తమ జీవిత కాలంలో కనీసం నలుగురు మహిళలతో ఎఫైర్ నడిపిస్తున్నారు. ఇది మేం చెబుతున్న విషయం కాదు. స్వయంగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వాస్తవం. కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5 (NFHS-5)లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
సర్వేలో పాల్గొన్న పురుషులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లో సగటున ప్రతి పురుషుడు, తన జీవిత కాలంలో నలుగురు మహిళలతో లైంగిక సంబంధం కలిగి ఉన్నాడు. 2020-21 మధ్య నిర్వహించిన ఈ సర్వేలో.. సౌత్ లోని ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే, ఆంధ్రప్రదేశ్ లో పురుషులే ఎక్కువ లైంగిక సంబంధాలు కలిగి ఉన్నారు.
రాష్ట్రంలోని మహిళలపై ఇదే సర్వే నిర్వహించగా.. సగటున ప్రతి మహిళ తన జీవితకాలంలో ఇద్దరితో (సగటు 1.4) సంబంధం కలిగి ఉన్నట్టు వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్ పురుషుల్లో ఈ సగటు ఏకంగా 4.7 ఉంది.
ఈ విషయంలో తెలంగాణ పురుషులు రెండో స్థానంలో ఉన్నారు. వీళ్లు సగటున తమ జీవిత కాలంలో ముగ్గురు మహిళలతో లైంగిక సంబంధం కలిగి ఉన్నట్టు సర్వేలో వెల్లడైంది. కర్నాటకలో పురుషులు 2.7 సగటు మహిళలతో, కేరళ, లక్షద్వీపుల్లో ప్రతి పురుషుడు ఒక మహిళతోనే లైంగిక సంబంధం కలిగి ఉన్నట్టు సర్వేలో తేలింది.
ఇక తమిళనాడులో ఈ సగటు 1.8గా ఉంది. అంటే, సగటున ప్రతి పురుషుడు తన జీవితంలో అటుఇటుగా ఇద్దరు మహిళలతో లైంగిక సంబంధం కలిగి ఉన్నాడని అర్థం.
హెచ్ఐవీ (ఎయిడ్స్)పై పురుషులు, మహిళల్లో ఎంత అవగాహన ఉందో తేల్చేందుకు, యూత్, టీనేజర్లలో లైంగిక వైఖరులు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ఈ సర్వే నిర్వహించారు. 15 సంవత్సరాల నుంచి 49 ఏళ్ల మధ్య ఉన్న స్త్రీపురుషులు ఈ సర్వేలో పాల్గొన్నారు. గడిచిన 12 నెలల్లో జీవిత భాగస్వామితో కాకుండా, ఇంట్లో ఉన్న మరో వ్యక్తితో కాకుండా.. బయట వ్యక్తుల్లో ఎంతమందితో సెక్స్ లో పాల్గొన్నారు అనేది ఈ సర్వేలో ప్రధానమైన ప్రశ్న.