ఇన్నాళ్లు తెలుగుజాతి అంటే కాకతీయులు, గజపతులు, రెడ్డి రాజులు, వెలమ, కమ్మ జమీందారులు ఇలా ఈ తెలుగునేలను పాలించిన ఎందరో గుర్తుకు వచ్చారు. ఏనాడో తెలుగు నేలను తమ పాలనతో, తమ రచనలతో, తమ ప్రజ్ఙాపాటవాలతో సుసంపన్నం చేసిన ఎందరో మహానుభావులు, మేధావులు, రచయితలు గుర్తుకువచ్చారు.
కానీ తెలుగు సంస్కృతి, నాగరికత అంటే వీరంతా కాదట..ఎన్టీఆర్ నే తెలుగు జాతి సంస్కృతి, నాగరికత అని ఇప్పుడు బాలకృష్ణ చెబితే తప్ప తెలియలేదు. అజ్ఙానం క్షమించాలి. తెలుగులోకి భారతం అందించిన వారు, హరికథకు శ్రీకారం చుట్టిన వారు, నాటక రచనను అజరామరం చేసినవారు, తెలుగునేలకు పోరు..పౌరుషం నేర్పిన వారు, వాగ్గేయ కారులు ఇలా ఎందరో,,ఎందరో మహానుభావులు.
వీళ్లంతా వెనక్కుపోయారు. తెలుగుజాతి అంటే ఎన్టీఆర్. తెలుగు సంస్కృతి అంటే ఎన్టీఆర్..ఆఖరికి తెలుగు నాగరికత అంటే ఎన్టీఆర్…అంతే కదా? బాలయ్య బాబూ? తెలుగువారికి కట్టు, బొట్టు ఎన్టీఆర్ నేర్పాడు. లేదూ అంటే అసలు నాగరికత అంటే తెలుగువారికి తెలియకపోను.
తెలుగింటి లోగిళ్లు, గోదారి ఒడ్డు పల్లెటూళ్లు ఎలా అఘోరించేవో? వేదంలా ఘోషించిన రాజమహేంద్రి ఎన్టీఆర్ లేకుంటే చిన్నబోయేది. గజపతులు ఏలిన విజయనగరం విలవిల లాడిపోయేది. కాకతీయులు కట్టిన కట్టడాలు వెలవెలబోయేవి. అష్టదిగ్గజాల్లాంటి కవులను పోషించిన పిఠాపురం మహరాజా, వాసిరెడ్డి కమ్మ జమీందారులు ఇలా ఎందరో ఎన్టీఆర్ ముందు దిగదుడుపే.
మద్రాసీలతో కలిసి వున్న ఆంధ్రను ప్రత్యేక రాష్ట్రంగా మార్చడానికి ప్రాణాలు ఒడ్డిన పొట్టి శ్రీరాములు మనకు గుర్తింపు ఇవ్వాలేదు. ఓ వర్గానికి అధికారం కోసం కాంగ్రెస్ తో కొట్లాడిన ఎన్టీఆర్ గుర్తింపు తీసుకువచ్చాడు. అంతే కదా బాలయ్యా? ఎన్టీఆర్ అనే వాడు లేకపోతే తెలుగువాడు ఠీవిగా నిల్చోలేకపోయేవాడు. ఎందుకంటే తెలుగుజాతి వెన్నెముక ఎన్టీఆర్ అని బాలయ్య చెబుతున్నారు.
ఎన్టీఆర్ సినిమాల్లో కిందా మీదా అవుతున్నపుడే కదా, విశాఖ ఉక్కు..ఆంధ్రుల హక్కు అని నినదించింది. అప్పుడు తెలుగువాడి వెన్నెముక ఎవరో? పాపం? బాలయ్యే చెప్పాలి.
మీనాన్న పేరు మార్చారని గోలపెట్టు..గగ్గోలు పెట్టు. పేరు మార్చడం తప్పు అని నినదించు. అంతే తప్ప, మొత్తం తెలుగుజాతి, తెలుగు సంస్కృతి..తెలుగు నాగరికత మొత్తం ఎన్టీఆర్ అనే మాటలు చెప్పొద్దు బాలయ్య. అంటే బాగోదు…అసహ్యంగా వుంటుందని మీరంతా మానేసి వుంటారు కానీ లేదంటే తెలుగువారందిరకీ తండ్రి లాంటి వాడు ఎన్టీఆర్ అనే అనేసినా అంటారు మీరు.
మీకా తెగింపు వుంది…కాదు…కాదు..నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు..నా ఇచ్చయేగాక నాకేటి వెరపు అని కవి దేవులపల్లి అన్నట్లు, అనడానికి మీరున్నారు. దాన్ని టముకేయడానికి మీ వర్గం వుంది. అచ్చేసి వదలడానికి మీ మీడియా వుంది.