మాజీ ఉప ప్రధాని, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి కేంద్రం భారతరత్న ప్రకటించింది. అద్వానీకి భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేయనున్నట్లు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ తన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా అద్వానీకి ఫోన్ చేసి, అభినందనలు తెలిపినట్లు మోదీ తెలిపారు.
అద్వానీకి భారతరత్న ఇవ్వనున్న విషయాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని.. దేశ నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని.. అట్టడుగు స్థాయి నుండి దేశ ఉప ప్రధానమంత్రిగా సేవ చేయడంతో ఆయన జీవితం స్పూర్తిదాయకమైనదని.. పార్లమెంట్‌లో ఆయన వ్యవహరించే తీరును కొనియడుతూ ట్వీట్టర్(ఎక్స్) వేదికగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
ఎల్కే అద్వానీ పూర్తి పేరు లాల్ కృష్ణ అద్వానీ.. పాకిస్తాన్‌లోని కరాచీలో పుట్టిన ఆయన దేశ విభజన టైంలో భారత్‌కు వచ్చారు. 1957లో ఆర్ఎస్ఎస్‌లో ప్రవేశించి 1973- 76లో జన సంఘ్‌కు అధ్యక్షుడుగా పని చేశారు. రెండు ఎంపీ సీట్లు ఉండే బీజేపీ పార్టీని దేశంలో తిరుగులేని పార్టీగా మార్చడంలో అద్వానీ ముఖ్య పాత్ర పోషించారు. కాగా దివంగత ప్రధాని, భారతరత్న వాజ్‌పేయీ హయంలో అద్వానీ ఉప ప్రధానిగా సేవలందించారు. మరోవైపు ఇటీవలే బిహార్ మాజీ సీఎం దివంగత నేత కర్పూరీ ఠాకూర్‌కు కేంద్రం భారతరత్న ప్రకటించిన విషయం తెలిసిందే.