నితీశ్‌ది కూడా చంద్రబాబు టెక్నిక్కేనా?

జాతీయ స్థాయిలో మోడీ వ్యతిరేక పార్టీలు అన్నింటినీ ఒక్క తాటిమీదకు తీసుకు రావడానికి, పటిష్టమైన కూటమిని ఏర్పాటుచేసి బిజెపి వ్యతిరేక ఓటు చీలకుండా చూడడానికి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన శక్తివంచన లేకుండా…

జాతీయ స్థాయిలో మోడీ వ్యతిరేక పార్టీలు అన్నింటినీ ఒక్క తాటిమీదకు తీసుకు రావడానికి, పటిష్టమైన కూటమిని ఏర్పాటుచేసి బిజెపి వ్యతిరేక ఓటు చీలకుండా చూడడానికి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. ఆయన స్వయంగా అనేక రాష్ర్టాలు తిరిగి భాజపాయేతర పార్టీల నాయకులతో సమావేశాలు నిర్వహించారు. అందరితో కలిసి బీహార్ లోనే భారీ సమావేశాలను కూడా ప్లాన్ చేస్తున్నారు. 

ఒకటే సమావేశంలో సీట్ల పంపకం తీరుతెన్నులు, పొత్తుల తీరుతెన్నులు కూడా తేలిపోయేలా త్వరత్వరంగా ప్రతపక్షాల సమీకరణ పూర్తి చేయాలని నితీశ్ పనిచేస్తున్నారు. ఇలాంటి సమయంలో.. ఆయన తాజా మాటలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. భారతీయ జనతా పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నదని నితీశ్ కుమార్ అంటున్నారు.

ప్రతిపక్షాల ఐక్యత కోసం తాను చేస్తున్న ప్రయత్నాలు చూసి భాజపాకు భయం పట్టుకున్నదని నితీశ్ అభిప్రాయపడుతున్నారు. అందరూ ఒక్కటి కావడాన్ని చూసి, ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటున్నట్టుగా చెబుతున్నారు. చూడబోతే నితీశ్ కుమార్ కూడా చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న రాజకీయ చతురత, టెక్నిక్ నే ఫాలో అవుతున్నట్టుగా కనిపిస్తోంది.

ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నారని, డిసెంబరులో ఎన్నికలు వచ్చేస్తున్నాయని చంద్రబాబు ఏడాదిన్నర నుంచరి టముకు వేస్తూనే ఉన్నారు. ఒకవైపు ముందస్తు అవకాశమే లేదని, తమకు అలాంటి ఆలోచనే లేదని ముఖ్యమంత్రి సహా అందరూ పదే పదే అంటున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. అలాంటి బూటకపు మాటలతో పార్టీ కట్టుతప్పిపోకుండా కాపాడుకోవాలని ఆరాటపడుతున్నారు. జనసేన, బిజెపి పార్టీలు పొత్తుల సంగతి త్వరగా తేల్చాలని కూడా అలాంటి ప్రచారం ద్వారా ఆయన కోరుకుంటున్నారు.

నితీశ్ కూడా అదే మాదిరి వ్యవహారం నడిపిస్తున్నట్టుగా ఉంది. మోడీని గద్దె దించాలని ఆయనకు విపరీతమైన కోరిక ఉంది. అదే సమయంలో కొత్త కూటమి అనేది కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోనే సాగాలనే కోరిక కూడా ఉంది. ప్రతిపక్ష నాయకులు స్పందిస్తున్నారే గానీ.. తొందరగా ఒక జట్టుగా కలవడం లేదు. ఈ నేపథ్యంలో ఈనెల 23న పాట్నాలో విపక్షాల సమావేశం ఏర్పాటుచేశారు నితీశ్. 

ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన సమావేశం ఇది. ఈసారి ఎందరొస్తారో కూడా తెలియదు. కాగా, ముందస్తు ఎన్నికలను బూచిగా చూపించి.. విపక్షాలను తొందరగా జట్టుకట్టేలా చేయాలని నితీశ్ ఆరాటపడుతున్నట్టుగా ఉంది. ఒకవైపు మోడీ సర్కారు కూడా ఎలాంటి ముందస్తు సంకేతాలు లేకుండా పాలన సాగిస్తోంది. కానీ ఇక్కడ చంద్రబాబునాయుడు, అక్కడ నితీశ్ కుమార్ మాత్రం ముందస్తు పేరు చెప్పుకుని.. తమ వ్యూహాలు నెరవేరాలని తలపోస్తున్నారు.