మతాన్నే నమ్ముకునే అలవాటు బీజేపీని వదలదు!

బిజెపి అంటేనే మతతత్వ పార్టీ అనే వాదన తొలినుంచి ఉన్నదే. బిజెపి ప్రతిసారీ కూడా మతాన్ని నమ్ముకునే రాజకీయం చేస్తూ మనుగడ సాగిస్తోందనే సంగతి అందరికీ తెలుసు. వారు కూడా తమ మతం ముద్రను…

బిజెపి అంటేనే మతతత్వ పార్టీ అనే వాదన తొలినుంచి ఉన్నదే. బిజెపి ప్రతిసారీ కూడా మతాన్ని నమ్ముకునే రాజకీయం చేస్తూ మనుగడ సాగిస్తోందనే సంగతి అందరికీ తెలుసు. వారు కూడా తమ మతం ముద్రను దాచుకోవడానికి ఏమాత్రం ప్రయత్నించరు. 

హిందూత్వ పార్టీగా ప్రజలు భావించినంత కాలం మాత్రమే తమకు మనుగడ అనుకుంటారేమో తెలియదు. అయితే ఒక మతానికి అనుకూలంగా ఉంటూ రాజకీయం చేయడం అనే దశ నుంచి.. మరో మతాన్ని ద్వేషించడమే ప్రాతిపదికగా రాజకీయం చేయడం అనే దుర్మార్గమైన దశకు బిజెపి చేరుకున్నట్టుగా కనిపిస్తోంది. 

కర్నాటక ఎన్నికలకోసం బిజెపి విడుదల చేసిన తొలిజాబితా చూస్తే ఈ సంగతి అర్థం అవుతుంది. కర్నాటకలో మొత్తం 224 స్థానాలుండగా.. మొదటా జాబితాలో 189 పేర్లను బిజెపి ప్రకటించింది. పుణ్యక్షేత్రమైన ఉడుపి నియోజకవర్గం నుంచి కొత్త అభ్యర్థిగా యశ్ పాల్ సువర్ణ పేరును ప్రకటించారు. 

నిజానికి ఇది బిజెపికి సిటింగ్ స్థానమే అక్కడినుంచి కె.రఘుపతి భట్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఆస్థానం నుంచి యశ్‌పాల్ సువర్ణ అనే మహిళను కొత్త అభ్యర్థిగా బరిలోకి దింపుతున్నారు. రఘుపతి భట్.. బిజెపి యువమోర్చా జిల్లా నాయకుడిగా ఉంటూ, ఉడుపి మునిసిపాలిటీకి ఎన్నికైన అంచెలంచెలుగా ఎదుగుతూ ఎమ్మెల్యే అయ్యారు. అలాంటి ఆయనను సువర్ణకోసం పక్కన పెట్టారు.

యశ్‌పాల్ సువర్ణ అంటే.. హిజాబ్ కు వ్యతిరేకంగా ఆమె బీభత్సంగా పోరాటం చేశారు. అంటే ముస్లిం విద్వేష పోరాటం అన్నమాట. ఉడుపిలో హిజాబ్ అనేది ఎంత పెద్ద రాద్ధాంతం అయిందో అందరికీ తెలుసు. తమను కాలేజీల్లోకి హిజాబ్ లతో అనుమతించాలనే ముస్లిం అమ్మాయిలు డిమాండ్ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. 

విద్యాసంస్థల్లో అనుమతించే విషయంలో నిర్ణయాలు ఎలా ఉన్నప్పటికీ.. హిజాబ్ అనేది ముస్లింల మతపరమైన వస్త్రధారణగా దాని మీద నిర్ణయించుకునే హక్కు వారికి ఉండాలి. అయితే ముస్లిం విద్వేష ప్రచారంలో భాగంగా.. హిజాబ్ వ్యతిరేక పోరాటం సాగించిన సువర్ణను.. సిటింగ్ ఎమ్మెల్యేను పక్కన పెట్టి మరీ అభ్యర్థిగా చేయడం ద్వారా.. బిజెపి తాను కర్ణాటకలో ఎలాంటి రాజకీయాలు చేయబోతున్నదో స్పష్టంగా సంకేతాలు ఇచ్చింది. 

ఇన్నాళ్లూ హిందూ మతాన్ని భుజాన మోసే పార్టీగా బతకాలని అనుకున్నవాళ్లు.. ఇప్పుడు ముస్లిం మతాన్ని ద్వేషించే పార్టీగా మనుగడ కోరుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.