టికెట్ నిరాక‌రించారు.. మాజీ మంత్రికి గుండెపోటు!

ఎన్నిక‌ల వేళ రాజ‌కీయ నేత‌ల ప‌రిస్థితి ఎలా ఉంటుందో చాటి చెప్పే సంఘ‌ట‌న ఇది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో పార్టీ టికెట్ నిరాకరించ‌డంతో ఒక రాజ‌కీయ నేత‌కు గుండెపోటు వ‌చ్చిన‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న బీజేపీ…

ఎన్నిక‌ల వేళ రాజ‌కీయ నేత‌ల ప‌రిస్థితి ఎలా ఉంటుందో చాటి చెప్పే సంఘ‌ట‌న ఇది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో పార్టీ టికెట్ నిరాకరించ‌డంతో ఒక రాజ‌కీయ నేత‌కు గుండెపోటు వ‌చ్చిన‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న బీజేపీ నేత‌. ఆ రాష్ట్ర మాజీ హోమంత్రి కూడా. పేరు ఉమాశంక‌ర్ గుప్తా, వ‌య‌సు 71 సంవ‌త్స‌రాలు. టికెట్ ఆశించి నియోజ‌క‌వ‌ర్గం భోపాల్ సౌత్ వెస్ట్. గ‌త ఎన్నిక‌ల్లో ఈయ‌న ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచినే పోటీ చేసి కాంగ్రెస్ అభ్య‌ర్థి చేతిలో ఓడిపోయాడు. ఆరున్న‌ర వేల ఓట్ల తేడాతో ఈయ‌న ప‌రాజయం పాల‌య్యారు.

గుప్తాకు చాలా రాజ‌కీయ నేప‌థ్య‌మే ఉంది. భోపాల్ కు మేయ‌ర్ గా వ్య‌వ‌హ‌రించారు. మూడు సార్లు ఎమ్మెల్యే, రాష్ట్ర హోం శాఖ మంత్రిగా కూడా వ్య‌వ‌హ‌రించారు. మ‌రి ఇంత నేప‌థ్యం ఉన్న నేత‌ను ఒక సారి ఎన్నిక‌ల్లో ఓడిపోయాడ‌ని ప‌క్క‌న పెట్టే స‌రికి ఆయ‌న నిరాశ చెందారు. 

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న మ‌ధ్య ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో తిరిగి అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి గెల‌వాల‌ని ఆశ‌తో ఉన్న ఆయ‌న‌కు పార్టీ హై క‌మాండ్ టికెట్ నిరాక‌రించే స‌రికి తీవ్ర వేధ‌నే క‌లిగిన‌ట్టుగా ఉంది. దీంతో ఆయ‌న గుండెపోటుకు గుర‌యిన‌ట్టుగా స‌మాచారం,  కుటుంబ స‌భ్యులు ఆయ‌న‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా ప్ర‌స్తుతానికి ప‌రిస్థితి స్టేబుల్ గా ఉంద‌ని ప్ర‌క‌టించారు. 

తాము టికెట్ నిరాకరించ‌డంతో గుండెపోటుకు గుర‌య్యార‌నే వార్త‌ల్లో నిలుస్తున్న మాజీ మంత్రి ప‌రిస్థితి గురించి బీజేపీ పెద్ద‌గా కామెంట్ చేయ‌లేక‌పోతోంది. ఆయ‌న ప‌రిస్థితి బాగానే ఉంద‌నే సంతోషాన్ని ఆ పార్టీ వ్య‌క్తం చేస్తోంది.  ఆసుప‌త్రిలో ఉన్న గుప్తాను కాంగ్రెస్ నేత దిగ్విజ‌య్ సింగ్ వెళ్లి ప‌రామ‌ర్శించారు. ఇప్ప‌టికే ఆ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేనే బ‌రిలోకి దించ‌గా, గుప్తా స్థానంలో మ‌రొక‌రిని బీజేపీ తెర‌పైకి తెచ్చింది.

70, 80 యేళ్ల వ‌య‌సున్న ప‌లువురు నేత‌ల‌కు బీజేపీ ఈ ఎన్నిక‌ల్లో మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో టికెట్ ఇచ్చింది. అయితే గుప్తాను మాత్రం ప‌క్క‌న పెట్టింది.