వరల్డ్ కప్ లో పాక్ జట్టు ప్రదర్శనపై ఆ దేశ మాజీ క్రికెటర్ల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రపంచకప్ లో మొదట్లో పాక్ మంచి ఊపు మీద కనిపించింది. శ్రీలంకపై భారీ టార్గెట్ ను చేజ్ చేసి ఆ జట్టు ఇండియాతో మ్యాచ్ కు ముందు జూలు విదిల్చింది. అయితే ఇండియాతో మ్యాచ్ లో మొదట్లో కాస్త స్టడీగానే కనిపించింది, ఆ తర్వాత 38 రన్నులు జోడించి ఏకంగా ఎనిమిది వికెట్లు కోల్పోయి మ్యాచ్ ను కోల్పోయింది. అప్పుడే పాక్ మాజీలకు మంట మొదలైంది.
వరల్డ్ కప్ లో ఇండియాపై కనీసం ఒక్కసారైనా గెలిచి పాత చరిత్రకు చరమగీతం పాడాలనేది పాక్ కల. అది ఈ సారి కూడా నెరవేరకపోవడంతో పాక్ క్రికెట్ అభిమానులు సహజంగానే నిరాశ చెందారు. ఇక అదే అనుకుంటే.. ఆఫ్ఘానిస్తాన్ తో ఓటమి పాక్ క్రికెట్ జట్టు పరిస్థితిని తేటతెల్లం చేసింది. దీంతో మాజీలు విరుచుకుపడుతున్నారు.
ఇందులో భాగంగా వసీం అక్రమ్ మాట్లాడుతూ.. పాక్ ప్లేయర్ల ఫిట్ నెస్ లెవల్ పై విరుచుకుపడ్డాడు. వారి ఫీల్డింగ్ చాలా చాలా దారుణంగా ఉందని అక్రమ్ అన్నాడు. టీవీ షోలో కూర్చున్నప్పుడల్లా రెండేళ్లుగా తను పాక్ ప్లేయర్ల ఫీల్డింగ్ గురించి మాట్లాడుతున్నాని వాపోయాడు. ఆఫ్ఘానిస్తాన్ తో మ్యాచ్ సందర్భంగా పాక్ ప్లేయర్ల కదలికలు చాలా లేజీగా ఉన్నాయని అక్రమ్ విశ్లేషించాడు. ఒక్కోరు ఎనిమిది కేజీల మటన్ తినే వారిలా ఉన్నారంటూ.. పాక్ ప్లేయర్ల ను అక్రమ్ విమర్శించాడు.
పాక్ కోచ్ గా మిస్బా ఉల్ హక్ ఉన్నప్పుడు ఫిట్ నెస్ పరీక్షలు పెట్టాడని, అయితే పాక్ ప్లేయర్లు ఎవరికీ అది నచ్చలేదంటూ అక్రమ్ అన్నాడు. పాక్ ప్లేయర్లకు ఫిట్ నెస్ పరీక్షలు తప్పనిసరిగా పెట్టాలనేది తన అభిప్రాయం అంటూ ఈ మాజీ ఆటగాడు అన్నాడు.