భగవంత్ కేసరి ప్రచారంలో ఉన్న నందమూరి బాలకృష్ణను ఆ సినిమాలోనే నటించిన శ్రీలీల ఇంటర్వ్యూ చేసింది. పేరుకు ర్యాపిడ్ ఫైర్ అయినప్పటికీ.. ఒక్కో ప్రశ్నకూ బాలకృష్ణ తనదైన శైలిలో సణుగుతూనే సమాధానం ఇచ్చారు. ప్రశ్నలైతే ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి కానీ, బాలకృష్ణ సమాధానాలు మాత్రం చిత్రవిచిత్రంగా ఉన్నాయి!
మీ సినిమాల్లో మీకు నచ్చిన సినిమాలు ఏవి?అంటూ శ్రీలీల అడిగిన ప్రశ్నకు బాలకృష్ణ సూటిగా సమాధానం ఇవ్వలేదు! నిజమే అన్ని సినిమాల్లో నటించిన నటుడికి తను చేసిన వాటిల్లో ఏది ఇష్టం అంటే చెప్పడం కష్టమే కాబోలు! అయితే బాలకృష్ణ అక్కడ ముహూర్తాల ప్రస్తావన తెచ్చాడు. తను అన్ని సినిమాలకూ ఒకేలా కష్టపడినట్టుగా చెప్పిన బాలకృష్ణ కొన్ని బాగా ఆడుతాయనుకున్న సినిమాలు పోయాయన్నారు. అలాగే ఆడవనుకున్న సినిమాలు ఆడాయని కూడా అన్నారు. వాటికి పెట్టిన ముహూర్తాలు సరిగా లేక అవి పోయుండొచ్చు అంటూ బాలకృష్ణ చెప్పడం గమనార్హం!
బాలకృష్ణకు ఈ ముహూర్తాల నమ్మకం ఏ స్థాయిలో ఉందో ఆయన సమాధానాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సినిమాలకు కథా, కథనాల సంగతెలా ఉన్నా.. ముహూర్తాలు ప్రభావితం చేస్తాయని ఈ స్టార్ హీరో బలంగానే విశ్వసిస్తున్నట్టుగా ఉన్నాడు.
ఇక మీకు బాగా నచ్చిన ఈ తరం హీరో, హీరోయిన్లు ఎవరనే ప్రశ్నకు కూడా బాలకృష్ణ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. అంతా బాగానే చేస్తారు.. అంటూ మొదలుపెట్టి, తన గురించి చెప్పుకుపోయారు తప్ప ఎవ్వరి పేర్లనూ బాలకృష్ణ ప్రస్తావించలేదు. మీకు ఎవరు నచ్చుతారనే ప్రశ్నకు సమాధానంగా తను, తన సినిమాల గురించే బాలకృష్ణ చెప్పారు!
కొశ్చన్ ఏదైనా.. బాలకృష్ణ ఆన్సర్ ఇవ్వడం కన్నా తను అనుకున్నది చెప్పడంతోనే ఆ ర్యాపిడ్ ఫైర్ సాగింది!