రాముడిపేరిట రాజకీయం- సీజన్ 2!

‘రాముడి పేరిట రాజకీయం’ అనేది కేవలం ఒక భారీ బడ్జెట్ సినిమా మాత్రమే కాదు. దానిని అదే టైటిల్ తో వెబ్ సిరీస్ గా మార్చేసే ప్రయత్నం కూడా జరుగుతోంది.  Advertisement కన్నడసీమలోని కమల…

‘రాముడి పేరిట రాజకీయం’ అనేది కేవలం ఒక భారీ బడ్జెట్ సినిమా మాత్రమే కాదు. దానిని అదే టైటిల్ తో వెబ్ సిరీస్ గా మార్చేసే ప్రయత్నం కూడా జరుగుతోంది. 

కన్నడసీమలోని కమల సర్కారు.. రాముడి పేరుతో రాజకీయం సీజన్ 2ను విడుదల చేయడానికి ఉవ్విళ్లూరుతోంది. ఈ ఏడాదిలో ఎన్నికలకను ఎదుర్కోవాల్సి ఉన్న నేపథ్యంలో రాముడే వచ్చి తమను ఆదుకోగలడని కోరుకుంటోంది. ఒకవైపు అయోధ్యలో రాముడి ఆలయాన్ని వచ్చే ఏడాది ఎన్నికల్లోగా పూర్తిచేసి, ఆ ఘనతను తమ ఖాతాలో వేసుకోవాలని కేంద్రంలోని బిజెపి కలగంటుండగా.. ఈ ఏడాది ఎన్నికల్లోగా రామమందిర నిర్మాణం తమ రాష్ట్రంలో ప్రారంభించడం ద్వారా.. లబ్ధి పొందాలని బొమ్మై ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది. ఇది అక్కడి తాజా వివాదం. 

బెంగుళూరుకు సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో రామనగర జిల్లాలో ఈ రామదేవరబెట్ట ఉంది. కర్ణాటకలో రామాయణ కాలం నాటి పరిణామ విశేషాలతో సంబంధం ఉన్నట్లుగా ప్రతీతిలో ఉన్న వాటిలో ఇది కూడా ఒకటి. రామదేవర బెట్టలో వనవాసం కాలంలో శ్రీరామచంద్రుడు కొంతకాలం పాటు నివాసం ఉన్నాడని అంటుంటారు. ఈ రామదేవరబెట్టలోనే సుగ్రీవుడు రాజ్యం ఏర్పాటుచేసినట్లు కూడా చెబుతారు. ఇక్కడ రామాలయం నిర్మించాలని స్థానిక మంత్రి ఒకరు సీఎంకు లేఖ రాయడంతో తాజా వ్యవహారం తెరపైకి వచ్చింది. 

ఇక్కడ దక్షిణాది అయోధ్యగా ప్రశస్తి పొందగల స్థాయిలో రామాలయం నిర్మిస్తామని బొమ్మై సర్కారు ప్రకటించింది. బడ్జెట్ లో కూడా ఈ విషయం పెట్టారు. దీనిపై వివాదమూ నడుస్తోంది. దీనిని ఎన్నికల స్టంట్ గా విపక్షాలు అభివర్ణిస్తున్నాయి. గుడి కట్టడం ఓకే గానీ.. ఎన్నికల ముందు ఆ మాట చెప్పడం డ్రామా అని అంటున్నారు. 

ప్రస్తుతానికి రామదేవర బెట్ట రాబందుల శాంక్చువరీ గా ఉంది. ప్రభుత్వం ఇక్కడ దక్షిణాదిలో ఎక్కడా లేనంత అపురూపమైన రామాలయం నిర్మించాలనుకుంటే తప్పేమీ లేదు.. కానీ రాముడిని తాము రాజకీయానికి వాడుకుంటున్నామనే అపప్రధ రాకుండా ఉండాలంటే.. అందుకు ప్రభుత్వ సొమ్మును వెచ్చించకుండా ఉండాలి. అవసరమైతే ప్రభుత్వం ఆలయ నిర్మాణానికి అవసరమైన స్థలకేటాయింపులు, అనుమతుల విషయంలో ఉదారంగా వ్యవహరించి నిధులను విడిగా సేకరించుకోవాల్సిందిగా సూచిస్తే ఎలాంటి విమర్శలు రాకుండా ఉంటాయి. అయోధ్య రామాలయ నిర్మాణం కూడా ట్రస్టు ఆధ్వర్యంలో ప్రజల, రామభక్తుల, హిందువుల విరాళాలతోనే సాగుతోంది. అదే పద్ధతిని రామదేవరబెట్ట ఆలయ నిర్మాణంలో కూడా అనుసరిస్తే బాగుంటుంది. 

రాముడు అంటేనే బిజెపికి అవినాభావ సంబంధం ఉన్న రాజకీయ అస్త్రం. రాముడిని వారు కేవలం రాజకీయానికే వాడుకుంటున్నారని అనిపించుకోకూడదు. ఇప్పుడు కర్ణాటకలో దక్షిణాది అయోధ్యను బొమ్మై సర్కారు నిర్మిస్తే.. రేప్పొద్దున ఏ తెలంగాణలోనో బిజెపి పార్టీ భద్రాచలాన్ని అయోధ్యకంటె మిన్నగా అభివృద్ధి చేస్తామనే నినాదంతో ఎన్నికలకు వెళుతుంది. అలాంటి సీక్వెల్ లు కొనసాగుతాయి. రాముడిని ఎప్పటికీ వారు ఎన్నికల పర్వంలో తురుపుముక్కగా వాడేస్తూనే ఉంటారు.