ఎమ్మెల్సీ పోల్స్: పవన్ మౌనం పార్టీకి ప్రమాదం!

కొన్ని పడికట్టు పదాలు నేర్చుకుని, వాటిని పదేపదే వాడడం ద్వారా.. ప్రజల్ని మాయచేయవచ్చునని అనుకుంటే ప్రతిసందర్భంలోనూ అది వర్కవుట్ కాదు! రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోవాలని కలగంటున్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న…

కొన్ని పడికట్టు పదాలు నేర్చుకుని, వాటిని పదేపదే వాడడం ద్వారా.. ప్రజల్ని మాయచేయవచ్చునని అనుకుంటే ప్రతిసందర్భంలోనూ అది వర్కవుట్ కాదు! రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోవాలని కలగంటున్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో.. ఈ అవకాశాన్ని వినియోగించుకోకుండా మౌనంగా ఉంటే ఎలా? అనే సందేహం పార్టీ వర్గాల్లోనే వ్యక్తం అవుతోంది. 

రాష్ట్రంలో సగభాగం.. ఎన్నికల గురించి మాట్లాడుకుంటున్న సమయంలో.. తమ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు మౌనంగా ఉండే వాతావరణం కల్పించడమే నష్టదాయకమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

రాష్ట్రంలో పట్టభద్ర, ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరుగుతున్నాయి గానీ.. వాటి జోలికి వెళ్లేంత దృశ్యం జనసేనకు లేదు. ఎటొచ్చీ ప్రజల్లో తమ అస్తిత్వాన్ని చాటుకోవడానికి అయినా.. పట్టభద్ర, ఉపాధ్యాయం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయవచ్చు. అయితే ఈ ఎన్నికలలో తమ పార్టీ తరఫున అభ్యర్థులను మోహరిస్తున్నట్టుగా బిజెపి ఇప్పటికే ప్రకటించింది. 

శాసనసభ ఎన్నికల విషయం వచ్చేసరికి తాము జనసేనతో పొత్తుల్లో ఉన్నామని, పవన్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేస్తామని సన్నాయి నొక్కులు నొక్కే సోము వీర్రాజు.. పవన్ తో సంప్రదింపుల తర్వాతనే తమ పార్టీ పోటీ గురించి ప్రకటించారో లేదో తెలియదు. మొత్తానికి ఈ స్థానాలు అన్నింటికీ బిజెపి బరిలో ఉండబోతోంది. వైసీపీ, టీడీపీ సంగతి సరేసరి. అయితే జనసేన సంగతేంటి? 

మేం ప్రజల తీర్పును కోరుతాం, ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంటాం, ప్రజాస్వామ్య బద్ధంగా జరిగే అవకాశం లేని ఈ ఎన్నికలను మేం బహిష్కరిస్తున్నాం.. లాంటి స్టాక్ పడికట్టు డైలాగులు కొన్ని పవన్ కల్యాణ్ వద్ద నిత్యం సిద్ధంగా ఉంటాయి. బరిలో నిలిచే ధైర్యం చేయకుండా ఆయన ఈ మాటలను వాడుకునే అవకాశం ఉంది. అయితే పార్టీ వర్గాలు, కార్యకర్తలు, నాయకులు మాత్రం భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో దిగడమే మంచిదని అంటున్నారు. 

ఇవి చదువుకున్నవాళ్లు, కాస్త ఆలోచన పరులు వేసే ఓట్లు గనుక నిష్పాక్షిక, నిజాయితీ రాజకీయాలకు పెద్దపీట వేస్తున్న తమ పార్టీకి ఎడ్వాంటేజీ ఉంటుందనేది వారి ఆలోచన. పైగా, ఇలాంటి ఎన్నికలతోనే పార్టీ శ్రేణుల్లో కాస్త ఫైర్ క్రియేట్ అయితే.. అసెంబ్లీ ఎన్నికల నాటికి సులువు అవుతుందని అనుకుంటున్నారు. అయితే పవన్ ఆలోచన వేరు. ఈ ఎన్నికల్లో బరిలోకి దిగగానే.. తమ పార్టీ బలహీనతలు బయటపడిపోతాయని, తమ బలం తీసికట్టు అనే సంగతి అందరికీ తెలిసిపోతుందని ఆయన సంకోచిస్తున్నారు. ఎన్నికల్లో పోటీచేయడం అనేది పార్టీ కార్యకర్తలను యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడుతుందనే సత్యాన్ని పవన్ విస్మరిస్తున్నారు.