అధికార పార్టీకి సహజంగా అంతర్గతమైన చికాకులు ఎక్కువగా ఉంటాయి. పార్టీ తమకు ఏదో ఒక మేలు చేయకపోతుందా? అనే ఆశలు, అంచనాలు నాయకుల్లో శ్రేణుల్లో ఎక్కువగా ఉంటాయి. అందుకే అసంతృప్తులు వర్గాలు కూడా ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు బుజ్జగించి, పార్టీని ఐక్యంగా ఉంచడం, ప్రజల ఎదుట పలచన కాకుండా చూసుకోవడం పార్టీ నాయకత్వం బాధ్యత.
కానీ కొన్ని సందర్భాలలో నాయకుల మధ్య విభేదాలు ముదిరి పార్టీ పరువుపోయే పరిస్థితి ఏర్పడుతుంటుంది. అలాంటప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డే చొరవ తీసుకోవాలి. అయితే చాలా నియోజకవర్గాల పరిధిలో వైసీపీలో ఉండే ముఠా కుమ్ములాటలను సర్దిచెప్పడానికి, ఆ బాధ్యతను జగన్ ఇతరుల మీద పెడుతుంటారు. చాలాచోట్ల కుమ్ములాటలు సర్దుకోవడం లేదు. అయితే, జగన్ స్వయంగా రంగంలోకి దిగితే ఖచ్చితంగా రిజల్ట్ తేడాగా ఉంటుంది. ఆ విషయాన్ని మైలవరం రాజకీయం నిరూపిస్తోంది.
మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే, చాలాకాలంగా స్తబ్దుగా ఉంటున్న, నిరాశతో, రాజకీయ వైరాగ్యం నిండిన మాటలు మాట్లాడుతున్న వసంత కృష్ణప్రసాద్ లో జగన్ ఉత్సాహం నింపారు. మైలవరంలో చాలాకాలంగా ఉన్న నాయకుల పంచాయతీని ఆయన ఒక కొలిక్కి తీసుకువచ్చారు. నాయకుల్ని బుజ్జగించడంలో తాను స్వయంగా రంగంలోకి దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ఆయన నిరూపించారు.
మైలవరంలో ఎమ్మెల్యే వసంత కృప్ణప్రసాద్ కాగా, మంత్రి జోగి రమేష్ వర్గం దెబ్బకు ఆయన కిందామీదా అయిపోతున్నారు. తట్టుకోలేకపోతున్నారు. వచ్చే ఎన్నికలనాటికి రాజకీయ సన్యాసం తీసుకుంటానని, సీఎం జగన్ కు కావలిస్తే నియోజకవర్గానికి కొత్త ఇన్చార్జిలను నియమించుకోవచ్చునని రకరకాల పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ఇవన్నీ నిరాశతో చేసినవే. జోగి రమేష్ ధాటికి వేసారిపోయిన వసంత, చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగానే ఉంటున్నారు. నాయకుల మధ్య సయోధ్య అసాధ్యంగా కనిపించినప్పటికీ.. జగన్ చొరవ తీసుకున్నారు. ఇటీవల నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి.. జోగి రమేష్ కూడా మనం తయారుచేసిన నాయకుడు, మనం కాపాడుకోవాలి అని మధ్యేమార్గంగా చెప్పారు.
కొన్ని రోజుల కిందట వసంతను ప్రత్యేకంగా తాను పిలిపించుకునిన మాట్లాడారు. సీఎంతో భేటీ తర్వాత వసంత నాగేశ్వరరావులో ఉత్సాహం ఉరకలేస్తున్నట్టుంది. ఆయన తిరిగి గాడిలోపడ్డారు. వాలంటీర్లు తదితరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీని గెలిపించడం గురించి, అప్పటికి వాలంటీర్లు అందరూ పార్టీని గెలిపించడంలో పోషించాల్సిన బాధ్యత గురించి చెబుతున్నారు. వాలంటీర్లకు వసంత ఎలాంటి స్ఫూర్తిని ఇస్తున్నారనేది తర్వాతి సంగతి. కానీ, వసంత నాగేశ్వరరావుకు మాత్రం జగన్ పూర్తిస్థాయిలో ప్రేరణ ఇచ్చి మార్పు తీసుకు వచ్చినట్టుంది.
నియోజకవర్గాల్లో పార్టీ ముఠాలుగా విడిపోయిన చోట్ల తాను స్వయంగా చొరవ తీసుకుని సర్దుబాట్లు చేస్తే.. ఫలితాలు ఇంత సానుకూలంగా ఉంటాయనే సంగతిని జగన్ ఇప్పటికైనా తెలుసుకోవాలి.