బ్రహ్మోస్ క్షిపణితో శత్రువులకు తమ సత్తా ఏంటో చూపామని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. లక్నోలో బ్రహ్మోస్ క్షిపణి తయారీ కేంద్రాన్ని వర్చువల్‌లో ఆయన ఢిల్లీ నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకున్నామన్నారు. బ్రహ్మోస్ క్షిపణి కేవలం ఒక యుద్ధ ఆయుధం కాదని, అది మన సందేశం అన్నారాయన.
ఇదే రోజున మనం పోఖ్రాన్‌లో అణుపరీక్షలు నిర్వహించామని ఆయన గుర్తు చేశారు. 40 నెలల్లోనే బ్రహ్మోస్ క్షిపణుల తయారీని లక్నో నుంచి ప్రారంభిస్తారన్నారు. ఆపరేష్ సింధూర్ ద్వారా పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్పామన్నారు.
కేవలం పాక్ సరిహద్దుపై మాత్రమే కాకుండా, రావల్పిండిపైనా దాడి చేశామని రక్షణమంత్రి గర్వంగా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదాన్ని సహించబోమని ఆపరేషన్ సింధూర్ ద్వారా మన ప్రధాని మోదీ హెచ్చరిక పంపారని ఆయన చెప్పుకొచ్చారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా మనమెక్కడా పాక్ ప్రజలపై దాడులు చేయలేదన్నారు. కానీ పాక్ సైన్యం మన ఆలయాలు, గురుద్వారాలపై దాడులకు ప్రయత్నించగా, సైన్యం బలంగా తిప్పికొట్టిందన్నారు.
యూరి, పుల్వామా, పహల్గాం దాడుల తర్వాత ప్రతిసారీ మన శక్తిని ప్రపంచానికి చాటి చెబుతున్నట్టు రక్షణ మంత్రి తెలిపారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్‌లో బ్రహ్మోస్ వాడినందుకే భారత్ విజయం సాధించిందన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో బ్రహ్మోస్ క్షిపణి సామర్థ్యాన్ని మీరంతా చూసి వుంటారన్నారు. ఒకవేళ చూడకుంటే బ్రహ్మోస్ క్షిపణి సత్తా గురించి పాకిస్థాన్‌ను అడగండని ఆయన అన్నారు.