మన దేశంలో గోధుమకి డిమాండ్ ఎక్కువ. నార్త్ ఇండియాలో అదే ప్రధాన ఆహారం. సుగర్ పెరిగిన తరువాత సౌత్ ఇండియాలో కూడా ఎక్కువ మంది రాత్రిళ్లు చపాతీలే తింటారు. గోధుమలతో తయారు చేసే బ్రెడ్, బిస్కెట్ ఇతర ఉత్పత్తులకి కూడా డిమాండ్ ఎక్కువ. ప్రపంచంలో గోధుమ బాగా పండే దేశాల్లో ఇండియా ఒకటి. రైతులు బాగా కష్టాల్లో వున్న దేశాల్లో ఇండియా టాప్. ఢిల్లీలో నెలల తరబడి ధర్నా చేసిన వారిలో గోధుమ రైతులదే మెజార్టీ.
రైతుల్ని అనావృష్టి, అకాల వర్షాలు, వరదలు, తుపాన్‌లు, నకిలీ మందులు, తెగుళ్లు, దళారులు కాకుండా ప్రభుత్వం కూడా వేధిస్తుంది. ఢిల్లీలో జరిగే రాజకీయాల వల్ల ఎక్కడో మారుమూల పల్లెలో వుండే రైతు ఆత్మహత్య చేసుకుంటాడు. ఒక పేద ఇల్లాలు పిల్లల్ని పస్తు పెడుతుంది.
ఇవన్నీ చెప్పడం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా గోధుమ ఎగుమతిని నిషేధించింది. నిన్నటి వరకూ దేశంలో ఆహార ధాన్యాలు సమృద్ధిగా వున్నాయని వీళ్లే చెప్పారు. ఇపుడేమో ఆహార భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని అంటున్నారు. ఒకవైపు గోధుమ ఎగుమతులని పెంచడానికి కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ విదేశాలకు ప్రతిపాదనలు పంపుతూ వుండగా, ఇంకోవైపు ఈ నిర్ణయం తీసుకున్నారు. కారణం ఏమంటే ఎగుమతుల వల్ల గోధుమల ధర దేశీయంగా పెరిగి ఆహార భద్రతకి ముప్పు ఏర్పడుతుందట. గోధుమ ధర ఏడాది నుంచి 19.3 శాతం పెరిగిందట. ఈ ఏడాది 111 మిలియన్ టన్నుల గోధుమలను అంచనా వేస్తే 105 మిలియన్ టన్నులే వచ్చిందట.
ఒకవేళ పంట తగ్గిందనే అనుకున్నా ప్రభుత్వ గోదాముల్లో అవసరానికి మించిన గోధుమలు స్టాక్ వున్నాయి. ప్రజాపంపిణీ వ్యవస్థకు కూడా ఇబ్బంది లేదు. రష్యా యుద్ధం వల్ల ఉక్రెయిన్, రష్యాల నుంచి గోధుమ ఎగుమతులు ఆగిపోయాయి. అందరూ ఇండియా వైపు చూస్తున్నారు. కానీ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే ప్రతిపక్షాలు ఏమంటాయంటే ఇది రైతుల్ని దగా చేసే కుట్ర అని. క్వింటాల్ గోధుమల కనీస మద్దతు ధర 2,015. మార్కెట్ వ్యాపారులకి అమ్మితే 2,200 వరకూ వస్తోంది. విదేశాలకి ఎగుమతి చేస్తే 3,410 రూపాయలు గిట్టుబాటు అవుతుంది. నిషేధం వల్ల వ్యాపారులు ఎక్కువ ధర ఇవ్వరు. రైతులు ప్రభుత్వానికే విధిలేక అమ్ముకుంటారు. మే 31కి సేకరణ పూర్తి అవుతుంది.
తర్వాత నేరుగా ప్రభుత్వమే వ్యాపారం చేస్తుంది. నిషేధం ఉత్పత్తుల్లో ఒక లొసుగు వుంది. ఏ దేశమైనా నేరుగా విజ్ఞప్తి చేస్తే గోధుమలు ఎగుమతి చేస్తారట. ఇలా మోసపోకూడదనే రైతులు ఉద్యమాలు చేశారు. కానీ రాజు తలచుకుంటే ఏమవుతుందో అందరికీ తెలుసు.
ప్రతిపక్షాల ఆరోపణలు, అనుమానాలు నిజమేనని అందరి నమ్మకం.
జీఆర్ మహర్షి