కమలం పార్టీ మళ్లీ ఓసారి కత్తి పదును సరిచూసుకుంటోంది. దేశంలో దాదాపుగా అన్ని రాష్ట్రాలలోనూ కమలపతాక రెపరెపలను కలగంటున్న భారతీయ జనతా పార్టీ.. ఈసారి భిన్నమైన వ్యూహంతో పావులు కదుపుతోంది. తమ మిత్రపక్షాన్నే ముక్కలు చేయాలనే భావనతో ఉంది. ఈ నయా కుట్ర రాజకీయానికి బీహార్ వేదిక కాబోతోంది.
జేడీయూలో చీలిక తేవడానికిన బిజెపి రంగం సిద్ధం చేస్తున్నదనే వార్తలు.. జేడీయూను విచ్ఛిన్నం చేయడానికి కమలం కదలికల నేపథ్యంలో అసలు ఎన్డీయే కూటమికే దూరం జరగడానికి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ యోచన చేస్తుండడం ఇప్పుడు బీహార్లోనే కాదు.. జాతీయ రాజకీయాల్లోనే హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
కాపురం చేసే కళ కాలు తొక్కిన నాడే తెలుస్తుందని సామెత. బీహార్ లో ప్రస్తుతం ఏలుబడి సాగిస్తున్న ప్రభుత్వం ఆదినుంచి శుభసంకేతాలు ఇవ్వలేకపోతోంది. కేవలం 43 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచిన పార్టీ సారథి అయినప్పటికీ.. నితీశ్ కుమార్.. తన సచ్ఛీలత కారణంగా.. 77 మంది ఎమ్మెల్యేలున్న భాజపా మద్దతుతో సీఎం పీఠం అధిష్టించారు.
ఇవాళ ఏ రకంగా అయితే.. మహారాష్ట్రలో ఏక్ నాధ్ శిండే.. బిజెపి అండతో గద్దె ఎక్కిన తక్కువ సభ్యులున్న పార్టీ నాయకుడిగా ఇరకాటం ఎదుర్కొంటున్నారో.. అంతగా ప్రాచుర్యంలోకి రాకపోయినప్పటికీ.. నితీశ్ కుమార్ కూడా అలాంటి ఇరకాటమే ఎదుర్కొంటున్నారు. ఇవి కొన్ని సంకేతాలు కాగా.. ఇటీవలి నీతిఆయోగ్ సమావేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్ లాగానే, బీహార్ సీఎం నితీశ్ కూడా గైర్హాజరు కావడం విశేషం. బిజెపి మిత్రపక్షమే అయినా ఆయన రాకపోవడంపై అప్పుడే గుసగుసలు వినిపించాయి.
ఇదిలా ఉండగా.. జెడీయూ ను చీల్చడానికి బిజెపి ప్రయత్నిస్తున్నదనేది ఒక వాదన. ఇలాంటి సంకేతాలు ఉండడం వల్లనే.. నితీశ్ ముందు జాగ్రత్త పడుతున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది.
కేంద్రంనుంచి జెడీయూకు చెందిన ఆర్సీపీ సింగ్ ఇటీవల రాజీనామా చేశారు. రాజీనామా తర్వాత.. ఆయన నితీశ్ ను తీవ్రంగా విమర్శించారు. తమకు సన్నిహితుడైన ఆర్సీపీసింగ్ ద్వారా పావులు కదిపి.. జెడీయూను చీల్చాలనేది బిజెపి ప్లాన్ గా ప్రచారంలో ఉంది. వారు ఇలాంటి వ్యూహరచన చేస్తుండగా.. ముందే నితీశ్ అలర్ట్ అవుతున్నారు.
ఆయన ఇప్పటికే సోనియాతో కూడా మాట్లాడినట్టు ఒక పుకారు. ఆయన బిజెపికి రాంరాం చెబితే.. మద్దతు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నట్టు ఆర్జేడీ అంటోంది. వారికి సభలో 75 మంది సభ్యుల బలం ఉంది.
ప్రస్తుతానికి జెడీయూ.. బిజెపిని విడిచిపెట్టి ఆర్జేడీ మద్దతుతోనైనా అధికారంలోకి రావడం సాధ్యమవుతుంది. కానీ.. బిజెపి ఊరుకోదు. ఆర్సీపీ సింగ్ ను ఉసిగొలిపి జెడీయూను ఖచ్చితంగా చీలుస్తుంది. అలా చీలిక వచ్చినా కూడా.. తన ప్రభుత్వం కూలిపోకుండా ఉండడానికి నితీశ్ కాంగ్రెస్, వామపక్షాల మద్దతు కూడా తీసుకునే అవకాశాలూ ఉన్నాయి. ఆ రెండు పార్టీలకు కలిపి 35 మంది సభ్యుల బలం ఉంది. ఇలాంటి సమీకరణాల నేపథ్యంలో బీహార్ రాజకీయం అనేక మలుపులు తిరుగుతోంది.
ఏది ఏమైనప్పటికీ.. రాష్ట్రాల్లో కమలపతాకలు ఎగురవేయడానికి బిజెపి మరో రాష్ట్రాన్ని ఎంచుకుంటోందన్నది కీలకాంశం. చీలిక రాజకీయాలకు పూనుకుంటోందన్నది ప్రధానం. ప్రస్తుతానికి బీహార్ వ్యవహారాలపై బిజెపి నాయకులు మాత్రం పూర్తిగా మౌనం పాటిస్తున్నారు. ఇదంతా.. పార్టీని చీల్చడానికి ముందు వారు పాటిస్తున్న భయానకమైన మౌనమనే అభిప్రాయం వినిపిస్తోంది.