Advertisement

Advertisement


Home > Politics - Opinion

కరువు ప్రాంతం రైతుల్లా తెదేపా మీడియా

కరువు ప్రాంతం రైతుల్లా తెదేపా మీడియా

అమీర్ ఖాన్ "లగాన్" సినిమాలో "కాలే మేఘా కాలే మేఘా పాని తో బరసావో" అంటూ సాగే ఒక సూపర్ హిట్ సాంగుంది. పంటలన్నీ ఎండిపోయి, మూడేళ్లుగా ఒక్క వాన చినుకుకి కూడా నోచుకుని పల్లె ప్రజలు కాస్త మబ్బు కనపడగానే వానొస్తోందన్న ఆనందంలో లేని ఓపికని కూడా తెచ్చుకుని ఎగిరెగిరి డ్యాన్సులు చేస్తారు. పాట పూర్తయ్యే సరికి మబ్బు తొలగిపోతుంది. ఒక్క చినుకు కూడా పడకపోగా మొహం మీద కస్సున ఎండ పడుతుంది. అందరూ నోరెళ్లబెట్టి దిగాలు పడతారు. 

సినిమాలో ఈ సన్నివేశం చూస్తే ప్రేక్షకులకి జాలేస్తుంది. ఇప్పుడు తెదేపా మీడియాని చూస్తుంటే కూడా అలాగే జాలేస్తోంది. 

ఆజాదీ అమృతోత్సవ్ అనేది దేశానికి సంబంధించిన పండగ. పార్టీలకి అతీతంగా అందరికీ ఆహ్వానాలందాయి. అందులో భాగంగా చంద్రబాబు కూడా వెళ్లారు. రాజకీయాలు పక్కనపెట్టి ప్రధాని కూడా కనపడ్డ అందరికీ కరచాలనాలు చేసి పలకరించారు. అంతకు మించి జరిగిందేమీ లేదు. 

కానీ ఈ దృశ్యం చూసిన తెదేపా మీడియాకి మళ్లీ చంద్రబాబు సీయం అయిపోయినంత సంబరమేసింది. బీజేపీ, తెదేపా పొత్తు కుదిరిపోతోందంటూ వార్తలు వండేశారు. పచ్చ తలపాగాలు చుట్టుకున్న ఆస్థానవిద్వాంసుల్ని కూర్చొబెట్టుకుని చర్చలు నడిపారు. 

ఇందులో వాళ్లకి నచ్చిన అతి ముఖ్యమైన పాయింటు, ఒకటికి నాలుగు సార్లు చెప్తున్న పాయింటు ఏమిటంటే.."చంద్రబాబు మోదీ దగ్గరకి రాలేదు. మోదీయే చంద్రబాబు దగ్గరకొచ్చి పలకరించారు" అని. 

చెప్పేవాడు పిట్టలదొరైతే వినేవాడు వెర్రినాగన్న అని...బిచ్చగాడు ఇంటి ముందు నిలబడ్డాడంతే..యజమాని స్వయంగా బయటికొచ్చి అన్నం పెట్టాడు..కనుక బిచ్చగాడే గొప్పవాడు అంటే ఎలా ఉంటుందో ఇదీ అలాగే ఉంది. 

చంద్రబాబు ఢిల్లీ దాకా వెళితేనే కదా మోదీ నాలుగడుగులు ముందుకేసి పలకరించింది! 

ఇలాంటి అతి పోకడలకి పోయే చంద్రబాబుని, తెదేపాని భ్రష్టు పట్టించేసింది తెదేపా మీడియా. 

తాగుబోతు తనకి మందే బలం అనుకుంటాడు. అది లేకుండా బతకలేనంత వ్యసనమైపోయాక మానమన్నా మానడు. ఆ మద్యం అతని లివర్ ని తినేసి అదే ప్రాణం తీసేస్తుందని గ్రహించడు. ఇక్కడ చంద్రబాబు పరిస్థితీ అలాగే ఉంది. ఈ తెదేపా మీడియా అతికామెడీ ప్రచారం వల్లే చంద్రబాబుకి నేడీ పరిస్థితి వచ్చింది. 

టీవీ5 సాంబశివరావు హాస్యానికి, ఏబీయన్ వెంకట్ కృష్ణ ఆరాటానికి, మహా టీవీ వంశీ ఉబలాటానికి హద్దులుండట్లేదు. ఒకరేమో చంద్రబాబుని మోదీ ఢిల్లీ రమ్మన్నారని చెప్తారు. మరొకరు బీజేపీ,తెదేపా,జనసేన పొత్తు కుదిరందంటూ చర్చలు పెడతారు. ఇంకొకరేమో దేశంలోని హేమాహేమీలు ఉన్న చోట ఒక్క చంద్రబాబునే పక్కకి పిలిచి మాట్లాడ్డమంటే మామూలు విషయం కాదంటారు. 

నిజానికి మోదీని ద్వేషించే ఫరూక్ అబ్దుల్లాని, సైద్ధాంతిక వ్యతిరేకులైన సీతారాం ఏచూరిని ఇలా పలువురు ప్రత్యర్థుల్ని చంద్రబాబుతో పాటూ కలిసి నిలబడి మాట్లాడారు మోదీ. అలా శతకోటి లింగాల్లో చంద్రబాబు కూడా ఒక లింగం మాత్రమే. మోదీ బాబుకిచ్చిన ప్రత్యేక మర్యాదలేవీ లేవక్కడ. 

ఇలా నిలబడి పలకరిస్తేనే ఇంత పండగ చేసుకుంటున్న పచ్చ మీడియా మరి నేడు జగన్ మోహన్ రెడ్డితో కూర్చుని ముచ్చటించిన మోదీని చూస్తే ఏమనుకోవాలి? మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు వరకూ లంచ్‌ మీటింగులో కూర్చున్నారు మోదీ- జగన్. ఇదే టేబుల్‌లో  రాజస్థాన్‌ సీఎం గెహ్లాట్, అసోం సీఎం హిమంత్‌బిశ్వాస్‌ శర్మ, ఇద్దరు లెఫ్టినెంట్‌ గవర్నర్లు కూడా ఉన్నారు. మోదీకి చంద్రబాబుతో పొత్తు కుదిరితే మరి జగన్ తో కూర్చోవడాన్ని ఏమంటారు పచ్చ మీడియా వారు? 

"ఏవిటి నాయనా ఈ వార్తలు" అని తిట్టాలనిపించినా..కోపం రాక జాలి పడే స్టేజ్ దగ్గరే ఆగిపోతోంది. 

పాపం ఈ ఎల్లో మీడియా ఆత్రం ఎలా ఉంటుందంటే..చంద్రబాబుకి, మోదీకి పొత్తు కుదిరిపోతోందంటే రాష్ట్ర ప్రజలంతా బాబుకి ఓట్లేసేస్తారని. 

ప్రపంచమంతా ఒకెత్తైతే ఈ ఎల్లో మీడియా జనం, అందులోని వార్తల్ని చదివే కూపస్థమండూకాలు మరొక ప్రపంచంలో ఉంటారు. వాళ్లనుకున్నదే నిజం అనుకుంటారు తప్ప కాస్తైనా మరో యాంగిల్లోంచి ఆలోచించరు. 

నిజానికి ఈ ఓవరాక్షన్ కి విసిగిపోయిన జనం తెదేపాకి 23 తో సరిపెట్టారు 2019 ఎన్నికల్లో. కానీ ఎల్లో మీడియా అభిప్రాయమేంటంటే ఆ మాత్రం ఓవరాక్షన్ చేయబట్టే ఆ మాత్రమన్నా వచ్చాయని. చంద్రబాబు అభిప్రాయం గురించి చెప్పుకోనక్కర్లేదు. ఎల్లో మీడియా అభిప్రాయమే వారిదీను. అందుకే ఓవరాక్షన్ అస్సలు ఆపట్లేదు. ఇంకా పెంచేసాయి పచ్చ మెడియాలు. తవ్వినా దొరకని రేంజులో.. మెరియానా ట్రెంచ్ అంత లోతులో తెదేపాని పాతిపెట్టేస్తున్నాయి ఈ మీడియా హౌసులు. అయినా తత్వం బాబుకి తత్వం బోధపదకపోవడం విధిరాత. 

కొసమెరుపు: ఎన్.టి.ఆర్ కుమార్తె ఆత్మహత్య వివాదం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి గోరంట్ల మాధవ్ వీడియోని బయటపెట్టి రచ్చ చేసారు. అయితే అసలక్కడ విక్టిం ఎవరూ కంప్లైంట్ ఇవ్వకపోవడంతో అది కాస్తా కమ్మ-కురుమ కులాల గొడవకి దారి తీసింది. ఇప్పుడా కులాల మంటల్ని తాళలేక మళ్లీ ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ చంద్రబాబు-మోదీ కరచాలనం సన్నివేశాన్ని వాడుకుని వార్తలు వండుతున్నారు. ఇది రేపు పాతబడుతుంది. మళ్లీ దేన్ని వెతుక్కుంటారో! ఇంకేం కొత్త వంట వండి వారుస్తారో ఎల్లో మీడియా ప్రబుద్ధులు! ఎవరి వంట వాళ్ళకింపు! మిగిలిన అశేష రాష్ట్ర ప్రజలకి మాత్రం కంపు! 

శ్రీనివాసమూర్తి

నేను రెడ్డి అని ఎందుకు పెట్టుకున్నానంటే...

జ‌గ‌న్ ను చూసి నేను మారను