Advertisement

Advertisement


Home > Politics - National

ఢిల్లీ నగరమే ఆశ్చర్యపోతున్న వేళ..

ఢిల్లీ నగరమే ఆశ్చర్యపోతున్న వేళ..

మనీష్ సిసోడియా.. ఆయన సాక్షాత్తూ ఢిల్లీ రాష్ట్రానికి ఉప‌ ముఖ్యమంత్రి. అంటే ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంతటి వాడు. ప్రజల మద్దతుతో రెండో దఫా కూడా విజయం సాధించిన ప్రభుత్వంలో అత్యంత కీలకమైన వ్యక్తి. అలాంటి వ్యక్తిని లిక్కర్ కుంభకోణంలో ఈడీ చాలా సునాయాసంగా అరెస్టు చేసింది. 

మహా అయితే చిన్నహైడ్రామా నడిచింది. ‘వాళ విచారణ తర్వాత తనను అరెస్టు చేస్తారు’ అనే క్లారిటీ వచ్చాక మనీష్ సిసోడియా ఇంటినుంచి ర్యాలీగా బయల్దేరారు. అరెస్టు చేయబోతున్నారని ర్యాలీలో ప్రకటించారు. మహాత్ముడి సమాధి వద్దకు వెళ్లి నివాళి అర్పించి, కాసేపు ధర్నాచేసి ఆతర్వాత వెళ్లి అరెస్టు అయ్యారు. అనుచరులు ఏదో కొంత ఈడీ కార్యాలయం వద్ద యాగీ చేయడంతో ఆ ఎపిసోడ్ ముగిసిపోయింది. 

సాక్షాత్తూ ఢిల్లీ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిని అరెస్టు చేస్తేనే వ్యవహారం అంత సింపుల్ గా ముగిసిపోగా.. ఢిల్లీ నగరానికి దూరంగా దక్షిణాదిలో ఉన్న తెలంగాణకు చెందిన నాయకురాలిని అరెస్టు చేయవచ్చుననే ఊహాగానాల మధ్య.. ఢిల్లీ నగరం యావత్తూ సంచలనం ఉద్రిక్తత నమోదు అవుతుండడం గమనించి.. ఢిల్లీ నగరమే ఆశ్చర్యపోతోంది. తన విచారణ, తన అరెస్టు అనే వ్యవహారాలకు ఆ మాత్రం సంచలనాత్మకతను జోడించడంలో కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత కృతకృత్యురాలు అయ్యారు. 

మనీష్ సిసోడియా అరెస్టు జరిగితే.. ఆయనను ఇన్నాళ్లూ తన డిప్యూటీగా ప్రోత్సహించిన సీఎం కేజ్రీవాల్.. ఇది రాజకీయ అరెస్టుగా, కక్షసాధింపు చర్యగా ఖండించారు. అంతే తప్ప ఢిల్లీ అంతా ఒక ఉద్రిక్తత తరహా వాతావరణం ఏమీ ఏర్పాటు కాలేదు. సిసోడియాతో రాజీనామా చేయించి.. ఆ శాఖలకు కొత్త మంత్రులను కూడా తీసేసుకున్నారు. 

కానీ కవిత అరెస్టు అంత స్మూత్ గా జరిగేలా కనిపించడం లేదు. అరెస్టుకు సంబంధించిన ఆందోళన కవితలో బాగా కనిపిస్తోంది. అదృష్టం కలిసి ముందు మహిళా దినోత్సవం రావడం, దాన్ని వాడుకుంటూ మహిళా బిల్లును బిజెపి సర్కారు తక్షణం పార్లమెంటులో ప్రవేశపెట్టాలనే డిమాండ్ ను లేవదీయడం, ఆ రూపేణా దేశంలోని వివిధ ప్రాంతాల పార్టీల, మహిళా నాయకుల మద్దతు తనకు ఉన్నదని చాటుకోవడం వ్యూహాత్మకంగా కవితకు కలిసి వచ్చాయి. 

మహిళా బిల్లుకోసం దీక్ష చేస్తే ఆమెతో కలిసి పాల్గొన్న నాయకులు అందరూ.. రేపు లిక్కర్ కేసులో ఆమె అరెస్టు అయితే.. ఆమెకోసం గళమెత్తుతారని అనుకోవడం భ్రమ. కానీ.. ఢిల్లీ నగరంలో సర్వత్రా కవిత వ్యవహారమే చర్చనీయాంశం అవుతోంది. 

కవితను ఖచ్చితంగా అరెస్టు చేస్తారని కేసీఆరే చెబుతున్న వేళ, ఆమె సోదరుడు కల్వకుంట్ల తారకరామారావు, మంత్రి హరీష్ రావు తదితరులందరూ ఢిల్లీ చేరుకోవడం, ఇతర మంత్రులు అనేకమంది కీలక నాయకులు ఆల్రెడీ అక్కడే ఉండడం, విచారణకు వెళ్లేప్పుడే తన లాయరును వెంటబెట్టుకుని వెళ్లాలని కవిత డిసైడ్ కావడం, బిఆర్ఎస్ పార్టీ లాయర్ల సమూహం అంతా ఢిల్లీ చేరుకుని.. ఎలాంటి పరిణామాలు ఎదురైతే.. ఎలా స్పందించాలనే వ్యూహరచనలు చేస్తుండడం.. ఇంత బీభత్సకాండను గమనిస్తున్నప్పుడు.. కవిత ఎపిసోడ్ చూసి ఢిల్లీ నగరమే విస్తుపోతున్నదని దేశమంతా అనుకుంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?