‘షా’ క‌మిష‌న్ రిపీట్ అవుతుందా?

కాంగ్రెస్ శ్రేణులు ధ‌ర్నా చేస్తున్న‌పుడు వి.హ‌నుమంత‌రావు ఒక మాట అన్నారు. “షా” క‌మిష‌న్ వేసి ఇందిరాగాంధీని వేధించిన‌ట్టు, ఈడీ ద‌ర్యాప్తులో రాహుల్‌గాంధీని వేధిస్తున్నార‌ని 1980 మ‌ళ్లీ రిపీట్ అవుతుంద‌ని ఆయ‌న జోస్యం చెప్పారు. ఆశ…

కాంగ్రెస్ శ్రేణులు ధ‌ర్నా చేస్తున్న‌పుడు వి.హ‌నుమంత‌రావు ఒక మాట అన్నారు. “షా” క‌మిష‌న్ వేసి ఇందిరాగాంధీని వేధించిన‌ట్టు, ఈడీ ద‌ర్యాప్తులో రాహుల్‌గాంధీని వేధిస్తున్నార‌ని 1980 మ‌ళ్లీ రిపీట్ అవుతుంద‌ని ఆయ‌న జోస్యం చెప్పారు. ఆశ ప‌డ‌డం త‌ప్పుకాదు. అత్యాశ త‌ప్పు కావ‌చ్చు. ఎందుకంటే ఇది 1980 కాదు 2022.

1977లో ఇందిర ఓడిపోయిన‌పుడు జ‌న‌తా అధికారంలోకి వ‌చ్చింది. ఎమ‌ర్జెన్సీ త‌ప్పుల‌పై “షా” క‌మిష‌న్ ఏర్పాటు చేసింది. ఇందిర‌ను దారుణంగా వేధించింది. ఆ రోజుల్లో రాత్రి 9 అయితే చాలు రేడియోలో “షా” క‌మిష‌న్ రిపోర్ట్ వినిపించేవాళ్లు. జ‌నం విసిగిపోయారు. వేధించేకొద్ది ఆమెపై సానుభూతి పెరిగింది. జ‌న‌తా కీచులాట‌ల్లో ఎన్నిక‌లు వ‌స్తే 1980లో ఇందిరాగాంధీ భారీ మెజార్టీతో గెలిచింది.

ఎవ‌రినైనా వెంటాడి వేధిస్తే జ‌నంలో సానుభూతి పెరుగుతుంది. జ‌గ‌న్ విష‌యంలో అదే జ‌రిగింది. ఈడీని వాడి జ‌గ‌న్‌ని జైలుకి పంపి కాంగ్రెస్ త‌న స‌మాధిని త‌న చేతుల‌తోనే క‌ట్టుకుంది. ఈడీ నిష్పాక్షికంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని ఎవ‌రికీ న‌మ్మ‌కం లేదు. అది కేంద్రం చేతిలోని కీలుబొమ్మ సంస్థ అని జ‌నం న‌మ్ముతున్నారు.

ఇపుడు కాంగ్రెస్ వంతు వ‌చ్చింది. నీవు నేర్పిన విద్య‌యే అని బీజేపీ ఈడీ అస్త్రాన్ని ప్ర‌యోగించింది. ఇపుడు కాంగ్రెస్ ఉలిక్కిప‌డి దేశ‌మంతా ఆందోళ‌న‌లు చేస్తోంది. దీనివ‌ల్ల కాంగ్రెస్ యాక్టీవ్ అయ్యి, శ్రేణులు రీచార్జ్ అయ్యాయి నిజ‌మే. అయితే కాంగ్రెస్ ఏం చెప్ప‌ద‌లుచుకుంది? ఈడీ రాహుల్‌పై కుట్ర చేస్తూ ఉంది అంటే ఇంత‌కాలం మీరు చేసింది అదే క‌దా? 

ఒక ప్ర‌భుత్వ సంస్థ‌ని ప‌ని చేయ‌కుండా చేయ‌డం కాంగ్రెస్ ఉద్దేశ‌మా? రాహుల్‌గాంధీ నిజాయితీప‌రుడైతే భ‌య‌మెందుకు? అవ‌క‌త‌వ‌క‌లు జ‌ర‌క్క‌పోతే ఉలికెందుకు? ఒక‌వేళ ఈడీ అన్యాయంగా ఇరికిస్తుంద‌నేది నిజ‌మైతే , దాన్ని ఆ ర‌కంగా త‌యారు చేసిన పాపం ఎవ‌రిది?

రాహుల్‌ని ఈడీ ప్ర‌శ్నిస్తే చొక్కాలు చింపుకుంటున్న కాంగ్రెస్ నాయ‌కులు, మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహ‌రావుని ద‌ర్యాప్తు సంస్థ‌లు విచారిస్తున్న‌ప్పుడు నోరు మెద‌ప‌లేదెందుకు?

మొత్తంగా ఆలోచిస్తే కాంగ్రెస్‌కి ఇది రీచార్జ్ పాయింటా? బీజేపీ వ్యూహాత్మ‌క త‌ప్పిద‌మా అనేది కాలం నిర్ణ‌యిస్తుంది.