హీరోయిన్ సాయిపల్లవిపై భజరంగదళ్ ఫిర్యాదు చేసింది. సుల్తాన్‌బజార్ స్టేషన్లో హిందూ సెంటిమెంట్స్‌ని ఆమె గాయపరిచారని ఫిర్యాదు సారాంశం.
ఇంతకీ ఆమె ఏమని చెప్పిందంటే కశ్మీర్ ఫైల్స్ సినిమా చూశానని, అందులో తీవ్రవాదులు పండిట్స్‌ని చంపడం ఎంత తప్పో, ఆవుల్ని తరలిస్తున్నారని ఒక వ్యక్తిని కొట్టి చంపడం కూడా అంతే తప్పని అంది. చంపడం తప్పని చెప్పిందే తప్ప, గోరక్షకులపై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. తనకి లెఫ్ట్, రైట్ లేదని, న్యూట్రల్ ఫ్యామిలీలో పెరిగానని చెప్పారు.
మతం పేరుతో హింస తప్పని, మనం మంచిగా వుండాలని చెప్పింది. మొదటి నుంచి సాయిపల్లవికి ధైర్యంగా మాట్లాడే అలవాటు. గతంలో కొన్ని యాడ్స్‌లో నటించడానికి తిరస్కరించింది. 2 కోట్ల పారితోషికం వదులుకుంది.
ఫెయిర్‌నెస్ క్రీం యాడ్స్‌లో తాను నటించను అని తెగేసి చెప్పింది. రంగు పుట్టుకతో వస్తుందని, ఫలానా రంగు చర్మం గొప్పదనే అభిప్రాయం తనకు లేదని చెప్పింది. ఇపుడు భజరంగదళ్ ఆక్షేపణ ఏమంటే కాశ్మీరి తీవ్రవాదులతో గోరక్షకుల్ని పోల్చడం, జై శ్రీరామ్ అంటూ కొట్టడం తప్పని ఆమె అనడం.
శుక్రవారం విరాటపర్వం విడుదల వుంది. నక్సల్ యువతిగా ఆమె నటించింది. ఈ వివాదం సినిమాకి మేలు చేస్తుందో, చేటు చేస్తుందో చూడాలి. పనిలో పనిగా విరాటపర్వం టైటిల్‌పైన కూడా సెన్సార్ బోర్డుకి భజరంగదళ్ ఆక్షేపణ తెలిపింది.