ఇటీవల ఏపీలో రైతుల పాలిట వకాల్తా పుచ్చుకుంటున్న లోకేష్ కి మంత్రి కాకాణి అదిరిపోయే పంచ్ ఇచ్చారు. 10 పంటలను చూపిస్తానని, వాటిలో 5 పేర్లు చెబితే చాలన్నారు. అసలు ఏ పంట పేరు ఏంటో, ఏ విత్తనం నాటితే ఏ మొలక వస్తుందో కూడా తెలియని లోకేష్.. క్రాప్ హాలిడే అంటూ హడావిడి చేస్తున్నారని, రైతుల తరపున లేఖలు రాస్తున్నారంటూ మండిపడ్డారు.
గతంలోనే తానీ సవాల్ విసిరానని ఇప్పటికీ లోకేష్ ముందుకు రాలేదన్నారు. మహా మేధావిలా, తానే వ్యవసాయ శాస్త్ర పితామహుడిలా నారా లోకేష్ లేఖలు రాస్తున్నారని, ఆయనకేమైనా వ్యవసాయంపై పరిజ్ఞానం ఉందా? అని ప్రశ్నించారు. ఎవరో రాసిన లేఖ మీద లోకేష్ సంతకం పెడుతున్నారని మండిపడ్డారు.
పవన్ కి కూడా పంచ్ పడింది..
పవన్ కల్యాణ్ ని డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటూ సెటైర్లు వేశారు మంత్రి కాకాణి. డబ్బింగ్ ఆర్టిస్ట్ పవన్.. టీడీపీ రాసిన లేఖలపై సంతకాలు పెట్టడం అలవాటు చేసుకున్నారని, వాళ్లు మాట్లాడమన్నట్లు మాట్లాడుతున్న పవన్.. ఆరిపోతున్న తెలుగుదేశం దీపానికి చేతులు అడ్డుపెడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.
క్రాప్ హాలిడే… ప్రతిపక్షాల కుట్ర..
రాష్ట్రంలో క్రాప్ హాలిడే పరిస్థితులు లేవన్నారు మంత్రి కాకాణి. రైతుల ఆశీస్సులు జగన్ కి మెండుగా ఉన్నాయని, అది చూసి ఓర్వలేకే.. విపక్షాలు క్రాప్ హాలిడేను తెరపైకి తెచ్చాయన్నారు. ప్రభుత్వానికి రైతుల్లో వ్యతిరేకత ఉందన్న భావన కలిగించేందుకే రైతుల్ని రెచ్చగొట్టి వాళ్లని రోడ్లపైకి తెచ్చి రాజకీయంగా పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు.
40ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఉండి, ముఖ్యమంత్రిగా పనిచేసిన బాబు కనీస పరిజ్ఞానం లేకుండా, నేల టిక్కెట్ వాళ్ల కన్నా దారుణంగా మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. సోమవారం పోలవరం అంటూ హెలికాప్టర్ పర్యటనలు చేసిన చంద్రబాబు.. పనులు చేయలేదని, బాబు హెలికాప్టర్ ఖర్చులతో సగం ప్రాజెక్ట్ పనులు పూర్తయ్యేవని చెప్పారు కాకాణి.
రాష్ట్రంలో రైతులు జోరుగా ఉంటే చంద్రబాబు బేజారైపోతారని, అందుకే ఇప్పుడు రైతు పోరు అంటున్నారని చెప్పారు కాకాణి. చంద్రబాబుకు సిగ్గుంటే.. వారి హయాంలో రైతులకు చేసిన మేలేంటో చెప్పాలన్నారు. వారు చెప్పుకునేందుకు ఏమీ లేకపోగా… మహానాడులు పెట్టి వైసీపీ నేతల్ని అయ్యన్నపాత్రుడితో బూతులు తిట్టించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.