ఏపీలో రోడ్ల మరమ్మతులుకు నిధులు మంజూరు అయినా కొన్నిచోట్ల కాంట్రాక్టర్లు నమ్మకం లేక వెనకడుగు వేస్తున్నారు. పాత బిల్లులే ఇంకా రాకపోవడంతో పిలిచి పనులు ఇస్తామన్నా చేయడం లేదు. ప్రధాన రోడ్ల పునర్నిర్మాణానికి వారు ముందుకు రావడంలేదు. దీంతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి స్వయంగా తానే వారికి పూచీకత్తు ఇస్తున్నారు.
ప్రభుత్వం దగ్గర కాంట్రాక్ట్ డబ్బులు రాకపోతే తానే వారికి సొమ్ము చెల్లిస్తానని మాటిస్తున్నారు. ఎక్కడా ఎవరికీ ఒక్క పైసా కూడా కమీషన్ ఇవ్వాల్సిన పని లేదని భరోసా ఇస్తున్నారు. దీంతో నెల్లూరు రూరల్ పరిధిలో రోడ్లకు మోక్షం కలుగుతోంది.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అయితే ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోనే ఇటీవల ప్రధాన రోడ్ల మరమ్మతులు జోరుగా సాగుతున్నాయి. గతంలో వర్షాల కారణంగా కొట్టుకుపోయిన చోట కూడా ఇప్పుడిప్పుడే కొత్త రోడ్లు వేస్తున్నారు. ఒక్క రూరల్ నియోజకవర్గంలోనే ఎందుకిలా అని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. దీనికి కారణం ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
కాంట్రాక్టర్లు భయపడి పారిపోతుంటే.. ఆయనే వారి వెంటపడి మరీ తీసుకొస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేక గతంలో బిల్లులు ఆలస్యమయ్యాయని, ఇప్పుడు నిధులు విడుదలయ్యాయని, ఏమాత్రం ఆలస్యం కాదని నచ్చచెబుతున్నారు. అయినా కొందరు అనుమానపడుతుండే సరికి.. 6 నెలల్లో బిల్లులు రాకపోతే తనదీ బాధ్యత అని ఆ భారం తనపైనే వేసుకున్నారు.
బోనస్ గా మరో ఆఫర్ కూడా ఇచ్చారు కోటంరెడ్డి. ఎక్కడా ఏ అధికారికి కానీ, స్థానిక నాయకులకు కానీ ఒక్క పైసా కూడా కమీషన్ ఇవ్వాల్సిన పనిలేదని, ఎవరు అడిగినా తన పేరు చెప్పాలని భరోసా ఇచ్చారు. ఇంకేముందు కాంట్రాక్టర్లు సై అన్నారు, నెల్లూరు రూరల్ పరిథిలో రోడ్లు తళతళలాడుతున్నాయి.
నెల్లూరు జిల్లాలోనే కాదు, మిగతా చోట్ల కూడా కాంట్రాక్టర్లు రోడ్లు వేయడానికి ముందుకు రావడంలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక సచివాలయ భవనాల నిర్మాణాలు, ఇతరత్రా కాంట్రాక్ట్ పనులు చేసినవారెవరూ సంతోషంగా లేరు. ఇటీవల చాలామంది మంత్రులు ఈ విషయాన్ని ఒప్పుకున్నారు కూడా.
ప్రభుత్వ పథకాలతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు కానీ, వైసీపీకి చెందిన కాంట్రాక్టర్లెవరూ సంతోషంగా లేరని ఓపెన్ గానే చెప్పారు. అలాంటి వారిని కూడా ఒప్పించి మరీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వారు పనులు చేయించుకుంటున్నారు.