కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటూ.. భారతీయ జనతా పార్టీ ఎనిమిదేళ్లుగా నినాదాన్ని గట్టిగా ఇస్తూనే ఉంది కానీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎంత చెడినా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎక్కడో ఒక చోట నుంచి కాస్తో కూస్తో ఉనికిని చాటుకుంటూనే ఉంది.
2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తు చిత్తుగా ఓడింది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ పెద్దగా రాణిస్తున్నది ఏమీ లేదు. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఊసులోనే లేదు! ఇదంతా వాస్తవమే! అయితే.. ఇప్పుడు రాజ్యసభలో ఆ పార్టీకి నాలుగు సీట్ల అదనపు బలం పెరుగుతుండటం గమనార్హం. మొన్నటి వరకూ రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ 29 సీట్లకు పరిమితం కాగా, ఇప్పుడు కొత్త నామినేషన్లతో ఆ పార్టీ బలం 33 కు పెరగనుంది.
ఇటీవలే పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న రాజ్యసభ సభ్యుల్లో కాంగ్రెస్ వారు ఏడు మంది ఉన్నారు. ఇలా ఆ పార్టీ కోల్పోతున్న సీట్ల సంఖ్య కంటే.. కొత్తగా ఆ పార్టీ తరఫున నామినేట్ అయ్యే వారి సంఖ్య నాలుగు అదనంగా ఉంది. తద్వారా రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కాస్త మెరుగు కానుంది.
కాంగ్రెస్ పార్టీకి రాజస్తాన్ నుంచి మూడు, ఛత్తీస్గడ్ నుంచి రెండు సీట్లు, తమిళనాడు, కర్ణాటక, జార్ఖండ్, మహారాష్ట్రల నుంచి ఒక్కో సీటు తరఫున లభించనున్నాయి.
దేశంలోని వివిధ రాష్ట్రాల అసెంబ్లీల్లో బలం ఆధారంగా లభించే రాజ్యసభ సభ్యత్వాల విషయంలో కాంగ్రెస్ పార్టీ కాస్త పురోగమనాన్ని సాధించడం గమనార్హం. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తవుతూ ఉండటంతో ఆ పార్టీ కథ అయిపోయిందని అని లెక్కలేసే వారికి రాజ్యసభలో ఆ పార్టీకి కాస్త బలం పెరగడం సహించరాని అంశం కావొచ్చు!