పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు తమకి దేవుడు.. పార్టీ మారితే అదే అధ్యక్షుడు రాక్షసుడిగా మారుతాడు. అంత వరకు బాగానే ఉన్న ఈ మధ్య కాలంలో పార్టీలు మరుతున్న రాజకీయ నాయకులు మరింతగా దిగజారి మాట్లాడుతున్నారు. తాజాగా ఓ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి అదే పార్టీకి వ్యతిరేకంగా కూటమి కట్టిన శివసేన(శిందే వర్గం)లోని ఎమ్మెల్యే సంజయ్ శీర్సత్ శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే కొడుకు ఆదిత్య ఠాక్రేపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్ర ఎంపీ ప్రియాంక చతుర్వేదిపై ఎమ్మెల్యే సంజయ్ శీర్సత్ అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక అందాన్ని చూసి ఆదిత్య ఠాక్రే ఆమెకు రాజ్యసభలో స్థానం కల్పించారన్నారు. దాంతో సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఈ వ్యాఖ్యలపై ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ.. 'నేను ఎలా ఉన్నానో.. ఎక్కడ ఉన్నానో మీలాంటి వారు చెప్పాల్సిన అవసరం లేదు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు. ఇవి మహిళల హుందాను దిగజార్చేలా ఉన్నాయి. వారి అభిప్రాయాలను గౌరవించండి 'అని ట్విట్ చేశారు.
ఆదిత్య ఠాక్రే కూడా స్పందిస్తూ.. 'వక్రబుద్ధితో ఆలోచిస్తున్నారు.. ఇలాంటి నీచమైన మనస్తత్వం గల వ్యక్తులు ఎలా రాజకీయాల్లో ఉన్నారో అర్ధం కావడం లేదు' అని మండిపడ్డారు. దీనిపై ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ.. మాజీ ఎంపీ చంద్రకాంత్ జైరే గతంలో ప్రియాంక చతుర్వేది గురించి తనతో అన్న మాటలనే తాను ఇప్పుడు చెప్పానని వివరణ ఇచ్చారు.