టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య తాజాగా 50వేలకు చేరింది. చరిత్రలోనే అతిపెద్ద భూకంపాల్లో ఒకటిగా నమోదైన ఈ ప్రకృతి విలయం, ఈ రెండు దేశాల్ని కుదిపేసింది. లక్షలాది మందిని నిరాశ్రయుల్ని చేసింది. వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
ఫిబ్రవరి 6న ఆగ్నేయ టర్కీ, ఉత్తర సిరియాల్లో మొదటి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 7.7గా నమోదైంది. తర్వాత 7.6 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. ఈ రెండు కంపనాలతో మృతుల సంఖ్య దాదాపు 20వేల వరకు ఉండొచ్చని ప్రాధమికంగా అంచనా వేశారు. అయితే రోజురోజుకు మృతుల సంఖ్య పెరిగింది. అది ఇప్పుడు 50వేలకు చేరుకుంది.
ఈ విలయంలో ఇరు దేశాల్లో కలిపి ఇప్పటివరకు లక్షా 60వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి. భూకంప తాకిడికి కూలిపోయే దశలో మరో 30వేల ఇళ్లు ఉన్నాయి. భూకంపం సంభవించిన రోజు నుంచి ఇప్పటివరకు తుర్కియే, సిరియాలో 9వేల సార్లు భూమి కంపించింది. నిన్న కూడా టర్కీలో స్వల్పంగా భూమి కంపించింది.
1999లో వచ్చిన భూకంపం వల్ల 13 మిలియన్ టన్నుల శిధిలాలు ఏర్పడగా.. తాజా భూకంపంతో 116 మిలియన్ టన్నుల శిధిలాలు ఏర్పడినట్టు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. దీన్ని బట్టి ఈ భూకంపం ఏ స్థాయిలో సంభవించిందో అర్థం చేసుకోవచ్చు.
తాజా భూకంపం వల్ల టర్కీలో 20 మిలియన్ల మంది, సిరియాలో 8.8 మిలియన్ల మధ్య ప్రభావితమయ్యారు. అసలే సిరియా అంతర్యుద్ధం కారణంగా వేలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. భూకంపంతో వీళ్ల కష్టాలు రెట్టింపయ్యాయి.