దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్ కేసును పోలీసులు ఓ కొలిక్కి తీసుకొచ్చారు. ఈ కేసులో ఎలాంటి లూప్ హోల్స్ లేకుండా అన్ని రకాల సాక్ష్యాల్ని సేకరించారు. 100 మంది సాక్షుల వాంగ్మూలాలతో పాటు, కీలకమైన ఫోరెన్సిక్ రిపోర్ట్, ఎలక్ట్రానిక్ ఆధారాల్ని కూడా సిద్ధం చేశారు. వీటన్నింటినీ క్రోడీకరిస్తూ.. ఏకంగా 3వేల పేజీల ఛార్జ్ షీట్ ను సిద్ధం చేస్తున్నారు పోలీసులు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది శ్రద్ధా వాకర్ కేసు. తన గర్ల్ ఫ్రెండ్ శ్రద్ధాను, ప్రియుడు ఆఫ్తాబ్ హత్య చేసి, శరీర భాగాల్ని ముక్కలుముక్కలు చేసి ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో విసిరేసిన ఉదంతాన్ని తెలుసుకొని అంతా నివ్వెరపోయారు. ఈ ఘటనలో ఆఫ్తాబ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు, అతడి నుంచి వాంగ్మూలాన్ని సేకరించారు.
అతడు ఇచ్చిన సమాచారంతో పాటు, సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా శ్రద్ధా వాకర్ శరీర భాగాల్ని సేకరించారు. శరీర అవశేషాల్ని, శ్రద్ధా డీఎన్ఏతో పోల్చి చూసి, అవి శ్రద్ధా శరీర భాగాలుగా నిర్థారించుకున్నారు.
ఈ కేసుకు సంబంధించి ఆఫ్తాబ్ పై నిర్వహించిన నార్కో పరీక్షల నివేదికను కూడా పోలీసులు, ఛార్జ్ షీట్ లో పొందుపరుస్తున్నారు. ఇప్పటికే హత్య చేసినట్టు అతడు అంగీకరించడంతో ఈ కేసు వీలైనంత త్వరగా క్లోజ్ అయ్యే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
ఈ నెలాఖరుకు 3వేల పేజీల ఛార్జ్ షీట్ ను కోర్టుకు సమర్పించనున్నారు పోలీసులు. ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదికతో పాటు.. ఎలక్ట్రానిక్ ఆధారాలు కీలకంగా మారనున్నాయి.