కర్నాటక సీఎం అభ్యర్థిని ఎంపిక చేయడంలో రోజుల తరబడి కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేయాల్సి వచ్చింది. సీఎం పీఠం కోసం మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఉడుం పట్టు పట్టినట్టు తెలిసింది. దీంతో వీళ్లిద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలనేది కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఎట్టకేలకు ఇవాళ్టికి సీఎం ఎవరనే విషయంలో ఒక స్పష్టత వచ్చింది.
సిద్ధ రామయ్య వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది. అయితే సిద్ధ రామయ్యను సీఎంగా డీకే శివకుమార్‌ను ఒప్పించడంలో రాహుల్‌గాంధీ కీలక పాత్ర పోషించారని సమాచారం. డీకేతో పలుమార్లు రాహుల్‌గాంధీ మాట్లాడి ఆయన్ను బుజ్జగించారని సమాచారం. సెంటిమెంట్‌తో డీకే అసంతృప్తిని చల్లార్చినట్టు చెబుతున్నారు.
“మీరు నా పెద్దన్న. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మీరు పాత్ర అమూల్యం. అయితే సీనియార్టీకి ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి. నీకు పార్టీలో, ప్రభుత్వంలో సమున్నత స్థానం కల్పిస్తాం. అలాగే నీ వర్గానికి నామినేటెడ్ పదవుల్లో పెద్దపీట వేస్తాం” అని చెప్పి డీకేను ఒప్పించినట్టు సమాచారం.
రాహుల్‌తో పాటు సోనియాగాంధీ కూడా నచ్చ చెప్పడంతో డీకే శివకుమార్ బెట్టు వీడినట్టు తెలుస్తోంది. కర్నాటక పీసీసీ అధ్యక్ష పదవితో పాటు డిప్యూటీ సీఎంగా నియమించనున్నట్టు సమాచారం. అలాగే హోంశాఖ మంత్రిత్వ పదవిని ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకుందని తెలిసింది. ఓపిక పట్టాలని, రానున్న కాలంలో మంచి భవిష్యత్ వుంటుందనే హామీతో డీకే కూడా చల్లబడినట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా కర్నాటక సీఎం అభ్యర్థిపై ఉత్కంఠకు తెరపడినట్టే.