బ్ర‌హ్మం నువ్వు మార‌వా…అయితే నిన్నే మారుస్తారు!

నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి మెత‌క వైఖ‌రే టీడీపీకి ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారింది. నంద్యాల‌లో నారా లోకేశ్ పాద‌యాత్ర ప్ర‌వేశించిన నేప‌థ్యంలో అక్క‌డి టీడీపీలో అంత‌ర్గ‌తంగా సాగుతున్న విభేదాలు ఒక్క‌సారిగా బ‌య‌ట‌ప‌డ్డాయి. నంద్యాల…

నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి మెత‌క వైఖ‌రే టీడీపీకి ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారింది. నంద్యాల‌లో నారా లోకేశ్ పాద‌యాత్ర ప్ర‌వేశించిన నేప‌థ్యంలో అక్క‌డి టీడీపీలో అంత‌ర్గ‌తంగా సాగుతున్న విభేదాలు ఒక్క‌సారిగా బ‌య‌ట‌ప‌డ్డాయి. నంద్యాల టీడీపీకి నాయ‌కులు ఎక్కువే. ఇప్ప‌టికే అక్క‌డ మాజీ మంత్రి ఫరూక్‌, మాజీ ఎమ్మెల్యే బ్ర‌హ్మానంద‌రెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి ఉన్నారు. వీరికిప్పుడు మాజీ మంత్రి భూమా అఖిల‌ప్రియ అద‌నంగా తోడ‌య్యారు.

నంద్యాల సీటు త‌న‌దే అని ఆమె అంటున్నారు. భూమా అంటే ఇప్పుడు అఖిల‌ప్రియ‌, బ్ర‌హ్మానంద‌రెడ్డి వేర్వేరని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆళ్ల‌గ‌డ్డ‌, నంద్యాల టికెట్లు త‌న కుటుంబానికే ఇవ్వాల‌ని అఖిల‌ప్రియ ప‌ట్టుబ‌డుతున్నారు. నంద్యాల‌లో త‌న అన్న బ్ర‌హ్మానంద‌రెడ్డి ఇన్‌చార్జ్‌గా ఉన్న‌ప్ప‌టికీ, అఖిల‌ప్రియ చొర‌బ‌డ్డారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో నీకేం ప‌ని అని బ్ర‌హ్మానంద‌రెడ్డి ప్ర‌శ్నించి వుంటే ఇవాళ ఈ ప‌రిస్థితి వ‌చ్చి వుండేది కాదు.

ఆళ్ల‌గ‌డ్డ‌కే ప‌రిమితం కావాల‌ని అఖిల‌ప్రియ‌, ఆమె త‌మ్ముడు జ‌గ‌త్‌విఖ్యాత్‌రెడ్డికి చంద్ర‌బాబునాయుడు, లోకేశ్ చెప్పిన‌ట్టు స‌మాచారం. అయితే వారి ఆదేశాల‌ను సైతం ఖాత‌రు చేయ‌కుండా నంద్యాల‌లో అఖిల‌ప్రియ టీడీపీ కార్యాల‌యాన్ని తెరిచారు. అస‌లే అఖిల‌ప్రియ‌, బ్ర‌హ్మానంద‌రెడ్డి మ‌ధ్య అంతంత మాత్రంగానే ఉన్న సంబంధాలు, ఇటీవ‌ల కాలంలో పూర్తిగా చెడాయి. ప‌ర‌స్ప‌రం మాట్లాడుకునే ప‌రిస్థితి లేదు.

నంద్యాల‌లో బ్ర‌హ్మానంద‌రెడ్డి వ్య‌తిరేకులంద‌రినీ అఖిల‌ప్రియ చేర‌దీస్తున్నారు. దీంతో బ్ర‌హ్మానంద‌రెడ్డి ఆగ్ర‌హంగా ఉన్నార‌ని స‌మాచారం. ఇటీవ‌ల నంద్యాల‌కు చెందిన ఓ లాయ‌ర్‌ను అఖిల‌ప్రియ టీడీపీలో చేర్చుకున్నారు. ఆ చేరిక‌ను బ్ర‌హ్మానంద‌రెడ్డి పూర్తిగా వ్య‌తిరేకిస్తున్నారు. ఫ‌రూక్‌, బ్ర‌హ్మానంద‌రెడ్డి మ‌ధ్య టికెట్ విష‌య‌మై పోటీ ఉన్నా, అంతిమంగా అధిష్టానం ఆదేశానుసారం న‌డుచుకుంటామ‌ని అంటున్నారు. ఇక ఏవీ సుబ్బారెడ్డి విష‌యానికి వ‌స్తే… తాను ఆళ్ల‌గ‌డ్డ లేదా నంద్యాల టికెట్‌ను ఆశిస్తున్న‌ట్టు చెబుతున్ప్ప‌టికీ, అంత సీన్ లేద‌ని ఆయ‌న‌కు కూడా తెలుసు.

త‌న‌కు సంబంధం లేని నంద్యాల నియోజ‌క‌వ‌ర్గంలో అఖిల‌ప్రియ విప‌రీత జోక్యానికి బ్ర‌హ్మానంద‌రెడ్డి మెత‌క వైఖ‌రే కార‌ణంగా టీడీపీ అధిష్టానం గుర్తించింది. క‌నీసం ఎన్నిక‌ల స‌మ‌యంలోనైనా కాస్త క‌ఠినంగా ఉండాల‌ని అధిష్టానంతో పాటు ఆయ‌న అనుచ‌ర వ‌ర్గం కూడా చెబుతోంది. బ్ర‌హ్మం ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం వ‌ల్లే అఖిల‌ప్రియ‌, ఆమె త‌మ్ముడు జ‌గ‌త్‌విఖ్యాత్‌రెడ్డి రెచ్చిపోతున్నార‌నే టాక్ వినిపిస్తోంది. బ్ర‌హ్మ‌మే గ‌ట్టిగా వుంటే, నంద్యాల‌లో ఆమె ఈ విద్య‌లు ప‌డేదుండేదా? అనే చ‌ర్చ న‌డుస్తోంది.

నిజానికి నంద్యాల నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌శాంత‌త‌కు మారుపేరు. ఎమ్మెల్యే శిల్పా ర‌విచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బ్ర‌హ్మానంద‌రెడ్డి రాజ‌కీయంగా ప్ర‌త్య‌ర్థులుగా మెలుగుతుంటారు. వ్య‌క్తిగ‌తంగా తిట్టుకోవ‌డం, అన‌వ‌స‌రంగా రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేయ‌డం లాంటివి అస‌లు ఉండ‌వు. కేవ‌లం అఖిల‌ప్రియ వ‌ల్లే నంద్యాల‌లో ఇటీవ‌ల భూవివాదాలు, రాజ‌కీయ గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయ‌ని భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి అనుచ‌రులు చెబుతున్నారు.

బ్ర‌హ్మానంద‌రెడ్డి అమూల్ బేబీలాగా న‌డుచుకోవ‌డంతోనే స‌మ‌స్య‌లు మ‌రిన్ని పెరిగి టీడీపీ రోజురోజుకూ ప్ర‌జ‌ల‌కు దూర‌మ‌వుతోంద‌న్న ఆందోళ‌న కేడ‌ర్‌లో క‌నిపిస్తోంది. రాజ‌కీయాల్లో కొన‌సాగాల‌నే ప‌ట్టుద‌ల బ్ర‌హ్మానంద‌రెడ్డిలో వుంటే, ఆయ‌న మారాలి. లేదంటే ఆయ‌న్ను టీడీపీ అధిష్టానం ఆయ‌న్ను మార్చేందుకు ఏ మాత్రం వెనుకాడ‌దు. ఎందుకంటే ఏ రాజ‌కీయ పార్టీ అయినా త‌న కోసం ప‌ని చేసేవాళ్ల‌ను ఆద‌రిస్తుందే త‌ప్ప‌, వ్యక్తుల కోసం త‌న ప్ర‌యోజ‌నాల‌ను ప‌ణంగా పెట్ట‌ద‌ని బ్ర‌హ్మానంద‌రెడ్డి గుర్తించాల్సిన అవ‌స‌రం వుంది. బ్ర‌హ్మం అర్థ‌మ‌వుతోందా?