లోక్ సభ ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీకి రాష్ట్రాల ఎన్నికల పరీక్ష ఎదురవుతోంది. తెలంగాణ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి కేంద్రం ఫీట్లు చేస్తోంది.
గత నాలుగేళ్లుగా ఎడాపెడా పెంచుకుపోయిన ధరలను కాస్త కట్టడి చేసి, ఓట్లను పొందాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం త్వరలోనే పెట్రో ధరల తగ్గింపు అంటూ ఇటీవలే కాస్త లీకులు ఇచ్చింది. అందులో భాగంగా పెట్రో ఉత్పత్తుల్లో భాగమైన గ్యాస్ ధరను కేంద్రం తగ్గించింది. డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ ధరను రెండు వందల రూపాయల మేర తగ్గించింది కేంద్రం. ఈ మేరకు కేంద్ర సమాచార శాఖ ప్రకటించింది. సిలెండర్ ధర రెండు వందల రూపాయల మేరకు తగ్గించాలని కేంద్రం నిర్ణయించినట్టుగా ప్రకటించింది. అలాగే ప్రధానమంత్రి మోడీ కూడా ఈ మేరకు ట్వీట్ చేశారు!
రక్షాబంధన్, ఓనమ్ సందర్భంగా ప్రజలకు ఈ రిలీఫ్ ను ఇచ్చినట్టుగా కేంద్రం ప్రకటించింది. ఈ పండగల సందర్భంగా మహిళలకు ఆనందాన్ని కలిగించడానికి గ్యాస్ ధరను తగ్గించినట్టుగా మోడీ తెలిపారు.
మొత్తానికి ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో సామాన్యులకు ఈ పాటి ఊరట అయినా లభిస్తూ ఉంది. గ్యాస్ ధరలే కాకుండా.. పెట్రోల్, డీజిల్ ధరలను కూడా స్వల్పంగా తగ్గించబోతున్నారనే లీకులు కూడా కేంద్రం నుంచి ఇది వరకే ఉన్నాయి. మరి రాష్ట్రాల ఎన్నికల్లోపు ఏ రెండు మూడు రూపాయలో తగ్గించే అవకాశాలు ఉంటాయేమో!