ఓవైపు దేశం మొత్తం రక్షాబంధన్ వేడుకల కోసం ఆనందంగా సిద్ధమౌతుంటే.. ఈ బాలికలు మాత్రం తమ గోడును ఎవరితో చెప్పుకోవాలో తెలియక తమలోతాము కుమిలిపోతున్నారు. అందుకే ముఖ్యమంత్రికి తమ రక్తంతో లేఖ రాశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. పదుల సంఖ్యలో బాలికలు తమ రక్తంతో సీఎంకు ఉత్తరం రాశారు.
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానికంగా ఉన్న పాఠశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నాడు రాజీవ్ పాండే. తనకు మూడ్ వచ్చిన ప్రతిసారి స్కూల్ లోని విద్యార్థినుల్ని తన గదిలోకి పిలిపించుకునేవాడు. వాళ్లతో అసభ్యంగా ప్రవర్తించేవాడు.
ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు.. పదుల సంఖ్యలో పాఠశాలలో బాధితులున్నారు. వీళ్లంతా 12-15 ఏళ్ల మధ్య వయసున్నవాళ్లే. ప్రిన్సిపాల్ ఆగడాలతో బాలికలు తెగ ఇబ్బంది పడ్డారు. ఎట్టకేలకు కొంతమంది బాలికల చొరవతో ఈ మేటర్ బయటకొచ్చింది. వెంటనే బాధిత బాలికల తల్లిదండ్రులు, పాఠశాలకు చేరుకున్నారు ప్రిన్సిపాల్ రాజీవ్ పాండేకు దేహశుద్ధి చేశారు.
అయితే అతడు మామూలు ప్రిన్సిపాల్ కాదు. ఆర్ఎస్ఎస్ లో సభ్యుడు కూడా. అందుకే అతడిపై చర్యలకు స్థానికి అధికారులు, పోలీసులు వెనకడుగు వేస్తున్నట్టు సమాచారం. దీంతో బాధితల బాలికలు తమ బాధను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ కు చెప్పాలనుకున్నారు.
అనుకున్నదే తడవుగా బాలికలంతా తమ రక్తంతో ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాదు.. తమకు, తమ కుటుంబసభ్యులకు వ్యక్తిగతంగా కలిసే అవకాశం ఇవ్వాలని కూడా అభ్యర్థించారు. లేఖ విషయం బయటకు వచ్చిన వెంటనే, కీచక ప్రిన్సిపాల్ ను పోలీసులు అరెస్ట్ చేశారని సమాచారం.