వర్క్ ఫ్రమ్ హోం కు మంగళం పాడుతున్నాయి కంపెనీలు. కరోనా పరిణామాల తర్వాత ఆరు నెలల కిందటి నుంచినే ఉద్యోగులను ఆఫీసులకు రప్పించడానికి కంపెనీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మొదట్లో వారానికి రెండు రోజుల పాటు అయినా ఆఫీసుకు హాజరు కావలనే నియమాన్ని పెట్టాయి టెక్ పార్క్ లలోని కంపెనీలు. ఈ విషయంలో ప్రభుత్వాల ఒత్తిడి కూడా ఉందనే వార్తలు వచ్చాయి!
కొన్ని కంపెనీలు వారంలో రెండు రోజులు అంటే, మరి కొన్ని కంపెనీలు మీకు వీలైనప్పుడు నెలలో ఎనిమిది రోజులు రండి అంటూ ఉద్యోగులకు సమాచారం ఇచ్చాయి. మొదట్లో ఈ విషయంలో చూసీ చూడనట్టుగా వ్యవహరించిన ఐటీ కంపెనీలు క్రమంగా ఒత్తిడి పెంచాయి.
ప్రస్తుతం వారానికి మూడు రోజుల ట్రెండ్ నడుస్తోంది. ఆగస్ట్ మొదటి వారం నుంచినే.. వారంలో తప్పనిసరిగా మూడు రోజులు అయినా ఆఫీసుకు హాజరు కావాలంటూ ప్రముఖ కంపెనీలు ఉద్యోగులను ఆదేశిస్తూ వచ్చాయి. వారంలో మూడు రోజులు అంటే.. కనీసం రెండు రోజులైనా ఉద్యోగులు రాకపోతారా అనే పరిస్థితి కనిపించింది.
అయితే వారంలో మూడు రోజులు అంటే, మూడు రోజులూ హాజరు కావాల్సిందే అని, రెండు రోజుల మినహాయింపును ఇస్తున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ ఒత్తిడి పెంచుతున్నారు హెచ్ఆర్‌లు. ఇక ఈ విషయంలో అమేజాన్ తన ఉద్యోగులకు గట్టి ఆదేశాలను ఇచ్చింది. వారంలో మూడు రోజులు తప్పనిసరిగా ఆఫీసుకు హాజరు కావాల్సిందే అని ఆ సంస్థ సీఈవోనే స్పష్టం చేశారు.
ఎవరికైనా ఈ విషయంలో అభ్యంతరం ఉంటే ఇంటికి వెళ్లి పోవచ్చని వ్యాఖ్యానించడం గమనార్హం. వర్క్ ఫ్రమ్ వారంలో రెండు రోజులే అని, అంతకు మించి కావాలంటే ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోవచ్చని అమేజాన్ సీఈవో స్పష్టం చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.
మొత్తానికి ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అంటూ మూడేళ్లకు పై నుంచినే కొనసాగిన హ్యాపీ టైమ్ ముగుస్తున్నట్టుగా ఉంది. ఏవో కొన్ని కంపెనీలను మినహాయిస్తే.. వర్క్ ఫ్రమ్ హోం కల్చర్ ను తగ్గించి వేస్తున్నాయి ప్రముఖ కంపెనీలు.