మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో మరో ఆసక్తిదాయకమైన ఘట్టానికి తెర లేస్తోంది. అధికారంలో చేజారి దశాబ్దం గడుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బోలెడంత సంక్షోభంలో ఉంది. ఆ సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి రాహుల్ గాంధీ తన చివరి ప్రయత్నాలేవో చేస్తున్నారు. తను చేపట్టిన ఈ యాత్రతో కాంగ్రెస్ లేచిందా సరే సరి. లేకపోతే రాహుల్ గాంధీ రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నా పెద్ద ఆశ్చర్యం లేకపోవచ్చు!
ఆ సంగతలా ఉంటే.. రాహుల్ యాత్ర మైలేజీని పార్టీ అధ్యక్ష ఎన్నిక హరించేలా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి 22 యేళ్లుగా ఎన్నికల్లేవు! ఇన్నేళ్లూ అంతా ఏకగ్రీవమే! సోనియాగాంధీ ఈ రెండు దశాబ్దాల్లో వరసగా ఏకగ్రీవంగా అధ్యక్ష హోదాకు ఎన్నికవుతూ వచ్చారు. ఒక సారి రాహుల్ కూడా ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆపద్ధర్మ హోదాలో సోనియా మరోసారి పగ్గాలు చేపట్టారు. ఇక రాహుల్ ఇప్పుడు ఆ బాధ్యతలు తీసుకోవడానికి రెడీగా లేడు!
ఇలాంటి నేపథ్యంలో తమ మాట వినే వారిని సోనియా నియమించడానికి సమాయత్తం అవుతుంటే, ఇంతలో శశిథరూర్ తగిలాడు. సోనియానే కలిసి ఆశీస్సులు అడిగాడు. ఎవ్వరైనా పోటీ చేసుకోవచ్చంటూ సోనియా చెప్పిందట!
అయితే అశోక్ గెహ్లాట్ ను కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడిని చేసి, రాజస్తాన్ లో రాగల సంక్షోభాన్ని నివారించాలనేది సోనియా ఆలోచన అనే ప్రచారం ఉంది. సచిన్ పైలట్ ను బీజేపీ దువ్వుతోంది. గెహ్లాట్ తో ఆయనకు పడటం లేదని తెలిసిన విషయమే. సచిన్ తిరుగుబాటు చేశాడంటే రాజస్తాన్ కూడా కాంగ్రెస్ చేజారుతుంది. అందుకు ప్రత్యామ్నాయం.. గెహ్లాట్ ను కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడిని చేసి ఆయనకు గౌరవాన్ని ఇచ్చినట్టు, ఇటు రాజస్తాన్ లో సంక్షోభం తలెత్తకుండా చూసుకోవడం సాధ్యం అవుతుందనేది సోనియా లెక్క!
మరి ఇంతలో థరూర్ తయారయ్యాడు. రేపోమాపో గెహ్లాట్ నామినేషన్ వేయనున్నాడట. మరి థరూర్ కూడా పోటీకి దిగితే.. 22 యేళ్ల తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోలింగ్ వరకూ వెళ్లనుంది వ్యవహారం!