ఇండియన్ అఫిషియల్ ఆస్కార్ ఎంట్రీగా ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రకటించకపోవడంతో ఆ సినిమా ఫ్యాన్స్ ఆక్రోశిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా వారు ఈ విషయంలో తీవ్రంగా స్పందిస్తున్నారు. స్క్రీనింగ్ కమిటీని నిందిస్తున్నారు. కమిటీనిది తప్పుడు నిర్ణయం అని వ్యాఖ్యానిస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ కు వెళుతుందంటూ ఆ సినిమాను అభిమానించే వాళ్లు, ఆ సినిమాలో నటించిన హీరోలను అభిమానించే వారు గత కొన్నాళ్లుగా తీవ్రంగా వాదిస్తూ వచ్చారు. వాస్తవానికి ఆ సినిమా విడుదలైనప్పుడు ఈ వాదనల్లేవు! ఎవరు కీ ఇచ్చారో కానీ.. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ రేసుకు వెళ్తుందంటూ ప్రచారం తీవ్రంగా సాగింది. అది కూడా ఈ నెటిజనులు చేసిందే!
ఆర్ఆర్ఆర్ సినిమాలో నటనకు గానూ రామ్ చరణ్ కు ఆస్కార్ అని, కాదు జూ.ఎన్టీఆరే అందుకు అర్హుడని, అలాగే కీరవాణికి మ్యూజిక్ కోటాలో ఆస్కార్ అని… నంది అవార్డులను పంచినంత ఈజీగా నెటిజన్లు వాటాలు వేశారు. వాస్తవానికి ఈ సినిమా డైరెక్టర్ రాజమౌళి పేరునే ఈ విషయంలో తక్కువగా ప్రచారానికి పెట్టారు. చరణ్, ఎన్టీఆర్ పేర్లతో ఆస్కార్ అంటూ గట్టిగా ప్రచారం చేసుకున్నారు.
మరి ఆ ప్రచారం కనీసం ఆర్ఆర్ఆర్ ను ఇండియన్ ఎంట్రీగా కూడా నిలపలేకపోయింది. ఇండియా దాటి వెళ్లి.. ఆ తర్వాత జరిగే స్క్రీనింగ్ లలో ఏదశలో వెనుకకు వచ్చి ఉన్నా..ఫ్యాన్స్ కు ఎంతో కొంత సంతోషం ఉండేది. అయితే ఇండియా తరఫున అఫియల్ టికెట్టే దక్కకపోవడం మాత్రం వారిని ఖిన్నులను చేస్తోంది.
ఇందుకు సంబంధించి వారు ఆక్రోశాన్ని వెల్లగక్కుతున్నారు. *ఇందుకే ఇండియా సినిమాలకు ఆస్కార్ రావడం లేదు* అంటూ మొదలుపెడుతున్నారు ఫ్యాన్స్! ఆర్ఆర్ఆర్ వంటి సినిమాను తిరస్కరించడం వల్లనే ఇండియాకు ఇంత వరకూ ఆస్కార్ దక్కడం లేదన్నట్టుగా వారు వాదిస్తున్నారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ను ఆస్కార్ రేసుకు పంపలేదు కాబట్టి.. ఇక ఈ ఏడాది కూడా భారతీయ సినిమాకు ఆస్కార్ దక్కే అవకాశం లేనట్టే అని, మరి కొన్నేళ్లు వేచి చూడాల్సిందే అని తేల్చి చెబుతున్నారు! అదే ఆర్ఆర్ఆర్ ను పంపి ఉంటే.. ఆస్కార్ లను వెంట వేసుకుని వచ్చేదనేది వీరి వాదన!
అలాగే కమిటీని కూడా తీవ్రంగా నిందిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ను అఫిషియల్ ఎంట్రీగా పంపకపోవడం దారుణమని .. కమిటీ ఎంపిక సరిగా లేదని ఆర్ఆర్ఆర్ బలగం సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందిస్తోంది.