అరే.. ఇలాంటి సినిమాలను అస్సలు ఆస్కార్ రేసుకు పంపర్రా బాబూ, ఇలాంటివి పంపితే ఉన్న పరువు కూడా పోతుంది! అంటే.. కస్సుమన్నారు ఫ్యాన్స్! ఆస్కార్ అంటే ఆర్ఆర్ఆర్ లు, కశ్మీరీ ఫైల్స్ కాదంటే.. కయ్యం చేసినంత పని చేశారు. మరేమైంది.. ఆస్కార్ రేసులో ఆదిలో, ఇండియా చేసుకున్న ఫిల్టర్ లోనే ఆర్ఆర్ఆర్, కశ్మీరీ ఫైల్స్ సినిమాలు వడపోతలో కొట్టుకుపోయాయి. వీటితో పాటు మరో తెలుగు సినిమా శ్యామ్ సింగరాయ్ ని కూడా స్క్రీనింగ్ కమిటీ పక్కన పెట్టింది.
అస్సలు ఎవ్వరికీ తెలియని గుజరాతీ సినిమా డార్క్ హార్స్ లా ఆస్కార్ రేసులో ఇంట గెలిచింది. ఈ సినిమా బయట గెలుస్తుందా లేదా అనేది వేరే సంగతి కానీ.. ఆర్ఆర్ఆర్ లు, కశ్మీరీ ఫైల్సు.. ఇవన్నీ ఇంట గెలిచేందుకు కూడా ప్రమాణాలను అందుకోలేదని కమిటీ క్లారిటీ ఇచ్చింది.
అర్ద సత్యాలు, అసత్యాలు, చారిత్రక వక్రీకరణలు, తోచిన వ్యాఖ్యానాలతో కూడిన సినిమాలను ఇలాంటి రేసులకు పంపేంత స్థాయికి మన స్టాండర్డ్స్ పడిపోలేదని కమిటీ ఎంతో కొంత ఊరటను ఇచ్చింది. మన తొడలను మనం కొట్టుకుంటూ, మనకు మనమే అది ఆస్కార్ రేంజ్ ఫెర్మార్మెన్స్ అంటూ ఊదరకొట్టుకుంటే నష్టం ఎవరికీ లేదు! అయితే అసలు విషయం వరకూ వస్తే.. కనీసం వీటిని మనవి అంటూ పోటీలో పెట్టలేమంటూ కమిటీ క్లారిటీ ఇచ్చింది.
ఒకవేళ ఇలాంటి కళాఖండాలు వచ్చినప్పుడు ఏ దుష్ట కాంగ్రెస్ ప్రభుత్వమో కేంద్రంలో అధికారంలో ఉండి ఉంటే.. అబ్బే, ఇదంతా కుట్ర, వాస్తవాలను చూపిన సినిమాలను, భారతీయతను చూపించిన సినిమాలను కావాలని కాంగ్రెస్ వాళ్లు తొక్కేశారంటూ వాట్సాప్ యూనివర్సిటీ ఘోషించేది.
అయితే కేంద్రంలోని కాషాయవాద ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీనే.. తమ కళ్లతో అన్ని సినిమాలను వీక్షించి.. అబ్బే ఇవి కావు, అది.. అంటూ ఒక డార్క్ హార్స్ ను రేసులోకి పంపింది. మరి అదిగో ఆస్కార్ , ఇదిగో జేమ్స్ బాండ్ సినిమా.. అనే ప్రచారాలకు కాస్త తెరిపి వచ్చినట్టేనేమో!