ఆస్కార్ అవార్డుల రేసులో భారత్ తరఫున నిలిచే సినిమా ఏదో స్పష్టత వచ్చింది. ఇందుకు సంబంధించి స్క్రీనింగ్ కమిటీ తమ ఎంపికను ఫైనల్ చేసింది. గుజరాతీ సినిమా 'చెహెల్లో షో' ఆస్కార్స్ లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించనుంది. ఈ సినిమా టైటిల్ ను ఇంగ్లిష్ లో * లాస్ట్ ఫిల్మ్ షో* గా వ్యవహరిస్తున్నారు. పేరెన్నికగన్న కమర్షియల్ సినిమాల పోటీని తట్టుకుని ఈ సినిమా ఇండియా తరఫున ఆస్కార్ బరిలోకి వెళ్తుండటం గమనార్హం.
తన జీవితంలో తొలి సినిమా ను చూసిన తర్వాత ఒక తొమ్మిదేళ్ల బాలుడి జీవితంలో చోటు చేసుకున్న పరిణామాల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారట! ఇలా ఈ సారి ఒక బయోగ్రఫికల్ డ్రామా ఆస్కార్స్ లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించబోతోంది.
గత ఏడాది ఇండియా తరఫున తమిళ సినిమా * జై భీమ్* పోటీలో నిలిచింది. సూర్య హీరో పాత్రలో నటించిన ఆ సినిమా ఆస్కార్స్ పై చాలా ఆశలే రేపింది. అయితే అంతిమంగా ఆ సినిమా ఆస్కార్ ను సాధించలేకపోయింది. అయితే ప్రముఖమైన గుర్తింపుకు అయితే నోచుకుంది.
ఇక చెహెల్లో షో విషయానికి వస్తే.. ఇది వరకే ఈ సినిమా పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శితం అయ్యింది. ఇప్పుడు డార్క్ హార్స్ గా ఆస్కార్ రేసును అందుకుంది. మరి ప్రతి యేటా ఒక సినిమాను పంపడం అది ఏదో ఒక దశలో వెనక్కు వస్తూ ఉండటం కొనసాగుతూనే ఉంది. మరి ఈ సారి కూడా అంతకు మించిన అంచనాలను పెట్టుకోవడానికి ఏం ఉండకపోవచ్చనేది ఒక అభిప్రాయం.
అలాగే గత కొంతకాలంలో ఆస్కార్ రేసుకు అంటే.. తమిళ, మలయాళీ, హిందీ, మరాఠీ వంటి భాషల సినిమాలు నిలిచాయి. ఈ సారి గుజరాతీ సినిమా ఫామ్ లోకి వచ్చింది.