Advertisement

Advertisement


Home > Politics - National

ఆవిరైపోతున్న అదానీ సంపద.. 3 నుంచి 38వ స్థానానికి పతనం

ఆవిరైపోతున్న అదానీ సంపద.. 3 నుంచి 38వ స్థానానికి పతనం

ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి అనే ఒక సామెత ఉంది. ఒక కార్పొరేట్ రీసెర్చి సంస్థ వెలువరించిన నివేదిక ఓడలు నిలిపే రేవులను నిర్వహించే అదానీ గ్రూప్‌కు ఒడ్డు లేకుండా చేసింది. అపర కుబేరుడిగా ఖ్యాతిగాంచిన అదానీ ఇప్పుడు ఆధారం కోసం కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. నెలరోజుల క్రితం ఫోర్బ్స్‌ ప్రపంచ శ్రీమంతుల జాబితాలో 120 బిలియన్‌ డాలర్లకుపైగా సంపదతో 3వ స్థానంలో నిలిచిన అదానీ ఇప్పుడు 38వ స్థానానికి దిగిపోయారు.

న్యూయార్క్‌ కేంద్రంగా ప‌ని చేసే హిండెన్‌‌‌‌‌‌‌‌బర్గ్ రీసెర్చి సంస్థ అదానీ గ్రూప్‌ కార్పొరేట్‌ అవకతవకలపై తీవ్ర ఆరోపణలు చేసిన తర్వాత గౌతమ్‌ అదానీ సంపద వేగంగా ఆవిరైపోతూ వస్తోంది. గ‌త ఏడాది సెప్టెంబర్‌లో 155 బిలియ‌న్ డాలర్ల సంప‌ద‌తో కొద్ది రోజుల పాటు ప్ర‌పంచ శ్రీమంతుల జాబితాలో ద్వితీయ స్థానానికి ఎగ‌బాకిన అదానీ కొన్ని వారాల త‌ర్వాత 120 బిలియ‌న్ డాలర్లకుపైగా సంపదతో మూడో ర్యాంక్ లో కొన‌సాగారు. హిండెబ‌ర్గ్ రిపోర్ట్ త‌ర్వాత అదానీ సంప‌ద‌లో 90 బిలియ‌న్ డాల‌ర్లపైగా క‌రిగిపోయింది. ప్ర‌స్తుతం 40 బిలియ‌న్ డాల‌ర్ల‌లోపున‌కు ప‌డిపోయి ఫోర్బ్స్‌ ప్రపంచ శ్రీమంతుల జాబితాలో 38వ స్ధాననికి దిగ‌జారారు.

తాజా ఫోర్బ్స్‌ బిలియనీర్ల జాబితాలో ఫ్రాన్స్ ఫ్యాష‌న్, రియ‌ల్టీ దిగ్గ‌జం ఎల్‌వీఎంహెచ్‌ అధినేత బెర్నాల్డ్‌ ఆర్నాల్ట్‌ 207 బిలియన్‌ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. త‌రువాత స్థానాల్లో టెస్లా చీఫ్ ఎలాన్ మ‌స్క్(190.8), అమెజాన్ అధిప‌తి జెఫ్ బెజోస్ (116.7) ఉన్నారు. రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ 83.5 బిలియన్‌ డాలర్ల సంపదతో 8వ స్థానంలో నిలిచారు.

అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ గ్రీన్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌ షేర్లు గడిచిన నెల రోజులుగా టాప్‌ లూజర్స్‌గా నిలుస్తున్నాయి. అదానీ గ్రూప్‌పై జనవరి 24న విడుదల చేసిన నివేదికలో 88 ప్రశ్నలను హిండెన్‌బర్గ్‌ లేవనెత్తింది. ఇందులో 65 ప్రశ్నలు అదానీ గ్రూప్‌నకు చెందిన లిస్టెడ్‌ కంపెనీలకు చెందినవే. ఆ ప్రశ్నలన్నింటినీ అదానీ గ్రూప్‌ కొట్టిపారేసింది. హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌ వెలువడిననాటి నుంచి అదానీ గ్రూప్‌లోని 10 లిస్టెడ్‌ కంపెనీలు దాదాపు రూ.12.06 లక్షల కోట్ల మార్కెట్‌ విలువను కోల్పోయాయి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?