చాలా కాలం క్రితం ఓ చిన్న కథ చదివాను. ఓ అమ్మడికి ఫారిన్ వస్తువులు అంటే మోజు. ఓ సారి అమెరికాలో ఓ చిన్న బ్యాగ్ కొనుక్కుంది. ఇండియాకు వచ్చాక షోక్ గా వేసుకుని తిరుగుతుంటే ఎవరో చూసి ఇది మన దేశంలో తయారు చేసిందే అనేసారు. కాదని ప్రూవ్ చేయడానికి బ్యాగ్ లోపల ట్యాగ్ కోసం వెదికి చూస్తే ఓ మూల కనిపించింది. మేడ్ ఇన్ ఇండియా అని. తూచ్ ఇది అన్యాయం అంటే ఎవరో అన్నారు. అమెరికాకు ఇండియా ఫారిన్ నే కదా..అందువల్ల అక్కడికి ఇది ఫారిన్ మేడ్ అనే అని.
మన హీరోలు, సినిమా జనాల మోజు అలా వుంటుంది. మన దగ్గర ఏ సంస్థ అవార్డులు ఇస్తామని పిలిచినా వెళ్లరు. నంది అవార్డులు అంటే మొహం చాటేస్తారు. కొన్ని భారీ అవార్డులు ఇచ్చే సంస్థలు ముందుగా చెప్పి, వస్తామంటేనే ఇస్తామనే కండిషన్ తో అవార్డులు ఇస్తాయి. పాపం చాలా సంస్థలు అవార్డులు ప్రకటించడమే తప్ప హీరోలు రారు. బతిమాలుకుని, బామాలుకుని, సకల మర్యాదలు చేస్తే అప్పుడు కదిలి వస్తారు ఒకరిద్దరు.
కానీ అదే విదేశాల్లో చిన్న సంస్థ అంటే చాలు ఎగేసుకువెళ్తారు. బిజినెస్ క్లాస్ టికెట్ లు పెట్టుకుని, కొత్త కొత్త సూట్లు కుట్టించుకుని మరీ వెళ్తారు. మన అవార్డులు అన్నా, మన మీడియా అన్నా చిన్న చూపు. మన మీడియా కన్నా బాలీవుడ్ మీడియా అంటే మోజు. ఇప్పుడు హాలీవుడ్ అవార్డులు అంటే మోజు.
ఆర్ఆర్ఆర్ కు అవార్డులు అంటూ ఇప్పుడు నానా హడావుడి జరుగుతోంది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్ అంటూ..నిజానికి ఆ అవార్డులు పుట్టిందే గట్టిగా ఆరేళ్ల కిందట. 2017 నుంచి అవార్డులు ఇస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో కీలకంగా వుండే వారు ఎవరైనా ఈ క్రిటిక్స్ అసోసియేషన్ కు దరఖాస్తు చేసి సభ్యత్వం పొందొచ్చు. దానిక కొన్ని రూల్స్ వుంటాయి. వాటికి అర్హులైతే చాలు.
నిజానికి ఈ అవార్డులను మించిన స్థాయి వున్న అవార్డులు ఇచ్చే సంస్థలు మన దగ్గర చాలా వున్నాయి. కానీ వాటి మీద మన హీరోల చూపు పడదు. ఒకప్పుడు హైదరాబాద్ లో ఇలాంటి సంస్థలు చాలా వుండేవి. కానీ ఎవ్వరూ పట్టించుకోక అవార్డులు ఇవ్వడం మానేసాయి. కాస్తో కూస్తో సినిమా రంగంలో మాట చలామణీ, పలుకుబడి వున్న సంస్థలు మాత్రమే అవార్డులు ఇస్తున్నాయి. కమర్షియల్ అవార్డులు ఇచ్చే సంస్థలు రకరకాల మార్గాలు, ఉపాయాలు వాడి హీరోలను తీసుకువెళ్లగలుగుతున్నాయి. వాటికి తప్ప మరే సంస్థలు అన్నీ మన హీరోలు మొహం చూపించడం లేదు.
ఇప్పుడు విదేశీ సంస్థలు అంటే అవి ఎలాంటివి, వాటి రేంజ్ ఏమిటి అన్నది ఇక్కడి వారికి తెలియదు. కానీ విదేశాల్లో జనాలకు తెలుసు. ఆ అవార్డులను పట్టుకుని ఫోజు కొడుతుంటే ఫ్యాన్స్ కొట్టుకుంటూ వుంటే మన సంస్థల జనాలు నవ్వుకుంటున్నారు. విదేశాలంటే అంతే..అంతే అనుకుంటూ.