కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్. సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గులామ్ నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు అధినేత్రి సోనియాగాంధీకి ఆయన నాలుగు పేజీల లేఖ రాశారు. రాహుల్ గాంధీపై ఆయన విరుచుకుపడ్డారు. పార్టీ నడిపే సమర్థత రాహుల్‌కు లేదని ఆజాద్ విమర్శించారు. రాహుల్ ఉపాధ్యక్ష పదవి చేపట్టినప్పుడే పార్టీలో సంప్రదింపుల వ్యవస్థ నాశనమైందని దుయ్యబట్టారు. రిమోట్ కంట్రోల్‌తో పార్టీ నడుస్తోందని, కార్పోరేట్‌లకు పార్టీలో పెద్ద పీట వేశారని ఆరోపించారు.
ఇటీవల కాంగ్రెస్ కమిటీ చైర్మన్ పదవికి ఆజాద్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులివ్వడమే ఆలస్యం, వెంటనే ఆ పదవికి రాజీనామా చేసినట్టు ఆజాద్ ప్రకటించి తన నిరసనను ప్రకటించారు. పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆయన ఎప్పటి నుంచో అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ నుంచి వెళ్లిపోతారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది.
రాజ్యసభ సభ్యుడిగా ఆజాద్ పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భ్ంలో ఆయన గురించి ప్రధాని మోదీ తీవ్ర భావోద్వేగంతో మాట్లాడ్డం తెలిసిందే. ఆజాద్ ఉద్వేగానికి లోనయ్యారు. బీజేపీ తరపున రాజ్యసభకు ఎన్నిక అవుతారని, అలాగే రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలుస్తారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఏమైందో తెలీదు కానీ, ఆజాద్ అంశాన్ని బీజేపీ పక్కన పెట్టింది. తాజాగా కాంగ్రెస్ నుంచి వెళ్లిపోతూ రాహుల్‌పై తన అక్కసు వెళ్లగక్కారు.
కాంగ్రెస్ పార్టీకి రాహుల్ ఉపాధ్యక్షుడు అయ్యాకే పార్టీ నాశనమైందని తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్‌ది చిన్నపిల్లల మనస్తత్వమని ఆయన అభిప్రాయపడ్డారు. సీనియర్లను పక్కన పెట్టేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌తో సుదీర్ఘ అనుబంధాన్ని ఆయన ఎట్టకేలకు తెంచుకున్నారు.