Advertisement

Advertisement


Home > Politics - National

రాజ‌కీయాల్లోకి ఎంట్రీనే త‌ప్పన్నాడు, ఇప్పుడు మ‌ళ్లీ!

రాజ‌కీయాల్లోకి ఎంట్రీనే త‌ప్పన్నాడు, ఇప్పుడు మ‌ళ్లీ!

లోక్ స‌భ‌కు ఎన్నికైన నేప‌థ్యం ఉన్న బాలీవుడ్ హీరోల్లో ఒక‌రు గోవిందా. ఈ విష‌యాన్ని చాలా మంది మ‌రిచిపోయి ఉంటారు కానీ, 2004 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ముంబై నార్త్ నుంచి పోటీ చేసి విజ‌యం సాధించాడు ఈ బాలీవుడ్ కామెడీ హీరో. ఆ ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థి, అప్ప‌టి కేంద్ర‌మంత్రి రాం నాయ‌క్ పై విజ‌యం సాధించి సంచ‌ల‌నం రేపాడు ఈ న‌టుడు.

అలా కాంగ్రెస్ త‌ర‌ఫున లోక్ స‌భ స‌భ్యుడ‌య్యాడు. అప్ప‌టికే సినిమా హీరోగా గోవింద కెరీర్ బాగా ఇబ్బందుల్లో ఉంది. సోలో హీరోగా ఫ్లాప్ లు ఎక్కువైపోయి, కామెడీ సినిమాల్లో దొరికిన పాత్ర‌ను చేసుకుంటూ పోతున్న ప‌రిస్థితి. అలాంటి స్థితిలో ఎంపీ హోదా ల‌భించింది. ఆ త‌ర్వాత న‌టుడిగా మళ్లీ ఊపందుకున్నాడు. పార్ట్ న‌ర్ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో గోవిందాకు మ‌ళ్లీ కాలం క‌లిసొచ్చింది. కామెడీ సినిమాలతో మ‌ళ్లీ బిజీ అయ్యాడు.

ఇలా సినిమాల‌తో బిజీగా ఉన్న గోవిందా ఎంపీగా ఎవ‌రికీ అందుబాటులో లేడ‌నే టాక్ మొద‌లైంది. దీంతో 2009 నాటికి కాంగ్రెస్ ఆయ‌న‌కు టికెట్ ఇవ్వ‌లేదు. త‌న‌పై మ‌హారాష్ట్ర కాంగ్రెస్ నేత‌లు కుట్ర చేశార‌న్న‌ట్టుగా గోవింద అప్ప‌ట్లో వాపోయాడు. ఆ సీటు నుంచి కాంగ్రెస్ నేత సంజ‌య్ నిరుప‌మ్ పోటీ చేశారు 2009లో. అలా గోవిందా సినిమా కెరీర్ కు తెర ప‌డింది. ఆ త‌ర్వాత రాజ‌కీయాల‌పై గోవింద మాట్లాడుతూ.. త‌ను అటు వైపు వెళ్లి త‌ప్పు చేశానంటూ వాపోయాడు. పాలిటిక్స్ త‌న క‌ప్ ఆఫ్ టీ కాద‌ని వ్యాక్యానించాడు. 

ఆ త‌ర్వాత రాజ‌కీయంగా గోవిందాను ప‌ట్టించుకున్న వారు ఎవ‌రూ లేరు కానీ, శివ‌సేన(షిండే) ప‌క్షంలో ఇప్పుడు ఈ హీరో పేరు వినిపిస్తోంది. రెండ్రోజుల కింద‌ట గోవిందా వెళ్లి మ‌హారాష్ట్ర సీఎంను క‌లిసి.. ఆయ‌న నాయక‌త్వంలో ముంబాయి బాగా అభివృద్ధి చెందుతోందంటూ కితాబిచ్చాడు! షిండే క్యాంప్ నుంచి గోవిందాకు ఎంపీ టికెట్ ఖరారు అయ్యిందనే ప్ర‌చారం ఇప్పుడు ఊపందుకుంది. ముంబై నార్త్ నుంచినే ఈ హీరో మ‌రోసారి పోటీకి దిగుతాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది. మ‌రి ఒక‌ప్పుడు రాజ‌కీయాల్లో ఎంట్రీ త‌ను చేసిన త‌ప్పు అని చెప్పిన గోవింద ఇప్పుడు మ‌ళ్లీ పోటీకి దిగితే  ఆశ్చ‌ర్య‌మే అవుతుంది!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?