వరల్డ్ రికార్డ్ సృష్టించిన ఢిల్లీ వైద్యులు

తుంటి మార్పిడి ఆపరేషన్ అంటే అనుభవం ఉన్న డాక్టర్లు కూడా అరగంటకు పైగా టైమ్ తీసుకుంటారు. కానీ భారత్ లోనే ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ కౌశల్ కాంత్ మిశ్రా దాన్ని 18 నిమిషాల్లో పూర్తి…

తుంటి మార్పిడి ఆపరేషన్ అంటే అనుభవం ఉన్న డాక్టర్లు కూడా అరగంటకు పైగా టైమ్ తీసుకుంటారు. కానీ భారత్ లోనే ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ కౌశల్ కాంత్ మిశ్రా దాన్ని 18 నిమిషాల్లో పూర్తి చేస్తారు. 18 నిమిషాల్లో హిప్ బాల్ రీప్లేస్ మెంట్ ఆపరేషన్ పూర్తి చేసిన రికార్డ్ ఆయన పేరిటే ఉంది. తాజాగా ఆయన 15 నిమిషాల 35 సెకన్లలోనే ఆ ఆపరేషన్ పూర్తి చేసి సరికొత్త రికార్డ్ సృష్టించారు, ఇదే నూతన ప్రపంచ రికార్డ్ కావడం విశేషం.

ఏదైనా ఆపరేషన్ నిదానంగా, నింపాదిగా చేస్తేనే పేషెంట్లకు మేలు. హడావిడిగా, రికార్డుల కోసం చేస్తే పేషెంట్లకు అపాయం. కానీ ఇక్కడ అరుదైన సందర్భంలో ఆ ఆపరేషన్ ని రికార్డ్ టైమ్ లో పూర్తి చేయాల్సి వచ్చింది. ఆపరేషన్ కోసం వచ్చిన 86 ఏళ్ల వయసున్న మహిళకు ఆల్రెడీ గుండె సమస్య ఉంది. రక్తనాళాల్లో రక్తం సరఫరా ఫ్రీగా ఉండేందుకు బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నారామె.

ఇలాంటి వారికి ఇతర ఆపరేషన్లు చాలా కష్టంతో కూడుకుని ఉంటాయి. రక్తం పలుచబడేందుకు వాడే మాత్రల్ని ఆపేసిన తర్వాతే వారికి ఆపరేషన్లు చేయాలి. లేకపోతే ఎక్కడ కత్తిగాటు పెట్టినా రక్తం కాలువలు కడుతుంది. తొందరగా గడ్డకట్టదు. అందుకే ఆ పేషెంట్ కి రికార్డ్ టైమ్ లో ఆపరేషన్ పూర్తి చేశారు వైద్యులు. కేవలం 15 నిమిషాల 35 సెకన్లలో హిప్ బాల్ మార్చేశారు. ఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్ హాస్పిటల్‌ లో ఆర్థోపెడిక్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ కౌశల్ కాంత్ మిశ్రా ఈ సర్జరీ చేశారు.

అందుకే వేగంగా చేశాం..

రికార్డ్ సృష్టించడం కోసం ఈ ఆపరేషన్ చేయలేదని, రోగి అవసరం మేరకే త్వరగా ఆపరేషన్ పూర్తి చేశామంటున్నారు వైద్యులు. రోగి డ్యుయల్ ఇంటిగ్రేటెడ్ థెరపీ, యాంజియోగ్రఫీ కోసం కార్డియాలజిస్టులు హెపారిన్ ఇస్తారని, ఇది సర్జరీ సమయంలో ఎక్కువ రక్తస్రావాన్ని కలిగిస్తుందని అన్నారు. అందుకే తాము యాంజియోగ్రఫీ తర్వాత గంటలోపే సర్జరీకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. 15 నిమిషాల 35 సెకన్లలో శస్త్రచికిత్స పూర్తి చేసి, రోగిని ప్రాణాపాయం నుంచి కాపాడామన్నారు.