టీ20ల్లో టీమిండియాకు ఒకింత పోటీని ఇచ్చిన శ్రీలంక జట్టు వన్డేలకు వచ్చే సరికి పూర్తిగా తేలిపోయింది. ఒక టీ20 మ్యాచ్ లో టీమిండియా పై విజయం సాధించి, ఫర్వాలేదనిపించుకున్న లంక ప్లేయర్లు వన్డేల్లో 3-0 తేడాతో స్వీప్ అయ్యారు. లంక పై టీమిండియా మరో సీరిస్ ను సొంతం చేసుకుంది.
శ్రీలంక జట్టు భారత గడ్డపై ఇప్పటి వరకూ ఏ ఒక్క సీరిస్ నెగ్గలేదు. టెస్టులు, వన్డేలు, టీ20లు ఇలా ఎలా చూసినా.. టీమిండియా పై ఇండియాలో లంక ఏ సీరిస్ నెగ్గలేదు. లంక జట్టులో మహామహులు ఉన్నప్పుడే అలాంటిది సాధ్యం కాలేదు. ఇప్పుడు శ్రీలంక జట్టు పూర్తిగా అనామకులతో నిండినట్టుగా కనిపిస్తుంది. కుర్రాళ్లే కానీ, కరువు కంట్రీకి బ్రాండ్ అంబాసిడర్లలా ఉన్నారు పాపం!
ఇక మూడో వన్డేలో భారత జట్టు భారీ విజయాన్ని సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసి ఏకంగా 390 పరుగులు సాధించింది భారత జట్టు. విరాట్ కొహ్లీ మరో శతకంతో చెలరేగాడు. తద్వారా వన్డేల్లో 46వ సెంచరీని పూర్తి చేశాడు. మరో మూడు సెంచరీలు సాధిస్తే సచిన్ తో సమానమైన స్థాయిలో నిలుస్తాడు కొహ్లీ. ఈ మూడు వన్డేల్లోనే కొహ్లీ రెండు సెంచరీలు చేశాడు. ఇదే ఊపులో చూస్తే.. ఈ ఏడాదిలో వన్డేల్లో కొహ్లీ 50 సెంచరీలను పూర్తి చేసి తన పేరిట కొత్త రికార్డును నెలకొల్పడం అసాధ్యం ఏమీ కాదు.
ఇక యువ ఆటగాడు శుభ్ మన్ గిల్ కూడా సెంచరీ సాధించి వన్డే వరల్డ్ కప్ లో తన చోటును ఖరారు చేసుకునే అవకాశాలను మెరుగుపరుచుకున్నాడు.
భారత జట్టు ముందుంచిన భారీ లక్ష్యాన్ని చేధించడంలో కనీస పోటీ ఇవ్వడం మాట అటుంచి 22 ఓవర్లకు ఆలౌట్ అయ్యింది శ్రీలంక. 22 ఓవర్లలో 73 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో సిరాజ్ నాలుగు వికెట్లను తీసి లంక వెన్ను విరిచాడు. షమీ రెండు, కుల్దీప్ యాదవ్ మరో రెండు వికెట్లను సాధించాడు. దీంతో భారత జట్టు 317 పరుగుల భారీ తేడాతో విజయాన్ని సాధించింది.