Advertisement

Advertisement


Home > Politics - National

కాంపా కోలా.. 80ల నాటి డ్రింక్ మళ్లీ వచ్చేసింది

కాంపా కోలా.. 80ల నాటి డ్రింక్ మళ్లీ వచ్చేసింది

దేశభక్తులారా కోకా కోలా మానేయండి, మన కాంపాకోలా వచ్చేస్తోంది అంటూ ఇటీవల కాలంలో మోదీ భక్తులు కొంతమంది వాట్సప్ స్టేటస్ లు పెట్టడం చూసే ఉంటాం. కాంపా కోలా నూటికి నూరు శాతం ఇండియన్ బ్రాండ్. ఈ మేడిన్ ఇండియా సరుకు అప్పట్లో విదేశీ కోలాలకు బ్రహ్మాండమైన పోటీనిచ్చింది. ఆ తర్వాత కనుమరుగైపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు కాంపా కోలాని రిలయన్స్ వాళ్లు తిరిగి మార్కెట్లోకి తెస్తున్నారు. ఈ వేసవి నుంచే ఇది ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది.

కాంపాకోలా కథేంటి..?

ప్యూర్ డ్రింక్స్ అనే కంపెనీ భారత్ లో 1949 నుంచి 1970 వరకు కోకా కోలా కంపెనీకి డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించింది. ఆ తర్వాత కాంపాకోలా పేరుతో సొంత బ్రాండ్ ని మార్కెట్లోకి దింపింది. అక్షరాలు కూడా కోకా కోలా మాదిరిగానే ఉండేవి. దీంతో అది కోకా కోలాకి కాంపిటీషన్ ఇచ్చింది.

దాదాపుగా కాంపా కోలా ఉత్తరాది మార్కెట్ మొత్తాన్ని కైవసం చేసుకుంది. దక్షిణాదిలో కూడా దీనికి క్రేజ్ ఉంది. ఆ తర్వాత పీవీ హయాంలో తీసుకొచ్చిన సంస్కరణల వల్ల విదేశీ కంపెనీల వ్యాపారం భారత్ లో బాగా పెరిగింది. దీంతో కాంపా కోలా బిజినెస్ డల్ అయింది. కోకా కోలా, పెప్సీ బ్రాండ్ల మధ్య కాంపాకోలా కనుమరుగైంది. దాన్ని తిరిగి మార్కెట్లోకి తెద్దామనుకున్నా కూడా కార్పొరేట్ కంపెనీల మార్కెటింగ్ మధ్య అది సాధ్యం కాలేదు.

కానీ 50 ఏళ్ల తర్వాత ఇప్పుడు కాంపాకోలాని రిలయన్స్ తిరిగి మార్కెట్లోకి తెస్తోంది. 22 కోట్ల రూపాయలకు కాంపా కోలా బ్రాండ్ ని కొనుగోలు చేసింది రిలయన్స్ సంస్థ. సోయో హజోరి బేవరేజెస్ సంస్థలో 50శాతం వాటా కొనుగోలు చేసిన రిలయన్స్, కాంపా కోలాతో కూల్ డ్రింగ్స్ సెగ్మెంట్ లో పోటీకి రెడీ అయింది.

కాంపా కోలా, కాంపా ఆరెంజ్, కాంపా లైమ్ అంటూ మూడు ఫ్లేవర్లను రిలయన్స్ మార్కెట్లోకి తెస్తోంది. ఇప్పటికే శాంపిల్స్ వచ్చేశాయి. ఇవి ప్రస్తుతం రిలయన్స్ ఔట్ లెట్స్ లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వేసవి నుంచి పూర్తి స్థాయిలో కాంపా కోలా సరుకు మార్కెట్లోకి దిగిపోతుందనమాట.

ఇటీవల లోకల్ మార్కెట్ ని ఒడిసి పట్టుకునేందుకు కొన్ని కంపెనీలు లోకల్ ఫ్లేవర్లను మార్కెట్లోకి తెచ్చినా అవి కోకా కోలా, పెప్సీ బ్రాండ్లకి ఉన్న గిరాకీని తగ్గించలేకపోయాయి. రంగు రంగుల్లో గోలీసోడా దూసుకొచ్చినా అది కూడా ఆరంభ శూరత్వమే అనిపించింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా 20రూపాయల బ్రాండెడ్ పెట్ బాటిల్స్ దే హవా. దీనికి పోటీగా వస్తోంది కాంపా కోలా.

10 రూపాయల పెట్ బాటిల్ తో కాంపా కోలా కాంపిటీషన్ కి రెడీ అయింది. కోకా కోలా, పెప్సీ బ్రాండ్ల ధరల కంటే రిలయన్స్ బాగానే ధరలు తగ్గించి అమ్మడానికి రెడీ అయింది. మేడిన్ ఇండియా సరుకు విదేశీ బ్రాండ్లను తట్టుకుని నిలబడగలదా.. రిలయన్స్ మార్కెటింగ్ వ్యూహం ఇక్కడ కూడా పనిచేస్తుందా.. మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?