9 కోట్ల బిర్యానీలు.. రూ.5 లక్షలు బిల్లు

ఎప్పట్లానే ఈ ఏడాది కూడా భారత్ ఫేవరెట్ డిష్ గా నిలిచింది బిర్యానీ.

ఎప్పట్లానే ఈ ఏడాది కూడా భారత్ ఫేవరెట్ డిష్ గా నిలిచింది బిర్యానీ. 2024లో జొమాటో ద్వారా 9 కోట్ల 13 లక్షల బిర్యానీ ఆర్డర్లు జరిగినట్టు సంస్థ వెల్లడించింది. తమ ఫ్లాట్ ఫామ్ ద్వారా సెకెనుకు 3 బిర్యానీల ఆర్డర్ అందుకున్నట్టు వెల్లడించింది. ఆఫ్-లైన్ ఆర్డర్లు, మిగతా యాప్ ఆర్డర్లు కూడా కలుపుకుంటే దేశవ్యాప్తంగా బిర్యానీ ఎంత పాపులర్ అనే విషయం ఇట్టే అర్థమౌతుంది.

ఇక జొమాటోలో అత్యథిక బిల్లు విషయానికొస్తే.. డైనింగ్ సేవల్లో భాగంగా బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి, ఏడాదిలో 5 లక్షల 13వేల రూపాయల బిల్లు చెల్లించాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ వ్యక్తి బెంగళూరులో ఒకే రెస్టారెంట్ కు రెగ్యులర్ గా వెళ్లి ఈ బిల్లు చెల్లించాడు.

ఇక ఆర్డర్స్ లో బిర్యానీ తర్వాత స్థానం పిజ్జాదే. 12 నెలల్లో 5 కోట్ల 84వేల పిజ్జాల ఆర్డర్లు అందుకుంది జొమాటో. గమ్మత్తుగా ఈ ఏడాది 77 లక్షల కప్పుల టీ, 74 లక్షల కప్పుల కాఫీని కూడా డెలివరీ చేసింది ఈ కంపెనీ. కాఫీ, టీలు కూడా ఆర్డర్స్ చేస్తున్న వాళ్ల సంఖ్య, గతేడాదితో పోలిస్తే బాగా పెరిగింది.

ఇక ఈ ఏడాది రిపోర్ట్ లో మరో ఆసక్తికర విషయం కూడా ఉంది. భారతీయ రైల్వేస్ తో అనుసంధానమైన తర్వాత రైలు నుంచి ఓ వ్యక్తి 120 మంచూరియన్ కాంబోలు ఆర్డర్ చేశాడు. ఇక ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి అయితే ఏడాదిలో 1377 విభిన్న రెస్టారెంట్లను ప్రయత్నించాడు.

జొమాటో కు అనుబంధంగా పనిచేస్తున్న బ్లింక్ ఇట్ నివేదికను కూడా వెల్లడించారు. ఈ ఏడాది 17 మిలియన్ ప్యాకెట్ల మ్యాగీని డెలవరీ చేసింది. ఈ యాప్ ద్వారా ఎక్కువగా నూడిల్స్, కూల్ డ్రింక్స్, కండోమ్స్ అమ్ముడుపోతున్నట్టు వెల్లడించింది. అత్యథికంగా చిప్స్ ప్యాకెట్లను హైదరాబాదీలు ఆర్డర్ చేస్తున్నట్టు వెల్లడైంది.

భారతీయుల ఆహార అలవాట్లు ఎలా మారిపోతున్నాయో ఈ నివేదిక స్పష్టం చేస్తుంది. మరీ ముఖ్యంగా సిటీల్లో ఉండే కుటుంబాలు, వ్యక్తులు ఇంట్లో వండుకుని తినడం గణనీయంగా తగ్గించినట్టు స్పష్టమౌతోంది. చివరికి కాఫీ, టీ కూడా ఆర్డర్లు పెడుతున్నారు. వీటికి తోడు శాకాహార భోజనం, సంప్రదాయ వంటకాల్ని తినేందుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదు. తాజా నివేదక చూస్తుంటే, ప్రజల ఆహారపు అలవాట్లు ఎలా మారిపోయాయో ఈజీగా అర్థం చేసుకోవచ్చు.

One Reply to “9 కోట్ల బిర్యానీలు.. రూ.5 లక్షలు బిల్లు”

  1. No wonder that these days in Hyderabad especially madhapur, hi-tech city and kukatpally areas – ground floor restaurant first floor hospital. Jai Swiggy. Jai Zomato. Janam aarogyam tomato.

Comments are closed.