ఇంగ్లాండ్ రాజ‌రికం.. చిత్ర‌విచిత్రాలెన్నో!

సుదీర్ఘ కాలంగా యూనైటెడ్ కింగ్డ‌మ్ మోనార్క్ గా వ్య‌వ‌హ‌రించిన ఎలిజ‌బెత్-2 మ‌ర‌ణంతో బ్రిట‌న్ రాజ‌రికం మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కొన్ని సంవ‌త్స‌రాల క్రితం ఎలిజ‌బెత్ బ్రిటీష్ రాణిగా యాభై సంవ‌త్స‌రాల‌ను పూర్తి చేసుకున్నారు. అప్పుడు…

సుదీర్ఘ కాలంగా యూనైటెడ్ కింగ్డ‌మ్ మోనార్క్ గా వ్య‌వ‌హ‌రించిన ఎలిజ‌బెత్-2 మ‌ర‌ణంతో బ్రిట‌న్ రాజ‌రికం మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కొన్ని సంవ‌త్స‌రాల క్రితం ఎలిజ‌బెత్ బ్రిటీష్ రాణిగా యాభై సంవ‌త్స‌రాల‌ను పూర్తి చేసుకున్నారు. అప్పుడు ప్ర‌పంచ‌మంతా ఆ విష‌యం గురించి గొప్ప‌గా చెప్పుకుంది! ఆఖ‌రికి ఇండియ‌న్ మీడియాలో కూడా ఆ సంద‌ర్భంగా పుంఖానుపుంఖాలుగా క‌థ‌నాలు వ‌చ్చాయి! బ్రిటీష్ రాణి గురించి గొప్ప‌గా చెప్పుకున్నారు. 

వాస్త‌వానికి బ్రిటీష్ రాజ‌రికం నామ‌మాత్ర‌మైన‌ది. అయిన‌ప్ప‌టికీ.. మిగ‌తా ప్ర‌పంచ‌మంతా బ్రిట‌న్ రాజ‌కుటుంబ వ్య‌వ‌హారాల గురించి ఎంతో ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తూ ఉంటుంది! ఇందుకు ప్ర‌ధానంగా రెండు కార‌ణాలున్నాయి. అందులో ఒక‌టి అది బ్రిట‌న్ కావ‌డం, రెండు అది రాజ‌రిక వ్య‌వ‌హారం కావ‌డం! బ్రిట‌న్ అన్నా ప్ర‌పంచానికి క్రేజే, రాజ‌రికం అన్నా ఆశ్చ‌ర్య‌మే! అందుకే బ్రిట‌న్ రాజ‌రిక విష‌యాలు బాగా ఆస‌క్తిని రేపుతాయి!

ప్రిన్సెస్ డ‌యానా వ్య‌వహారం అయినా, ఆమె చిన్న కొడుకు వ్య‌వ‌హారం అయినా.. ప్ర‌పంచం ఎంతో ఉత్సాహంగా చ‌ర్చించుకుంది. 1997లో రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన డ‌యానాను ప్ర‌పంచం ఎప్ప‌టికి మ‌ర‌వ‌దేమో! ఇప్పుడు ఇంగ్లండ్ రాజుగా ప‌ట్టాభిషిక్తుడ‌వుతున్న‌ది డ‌యానా భ‌ర్తే!

బ్రిట‌న్ రాజ‌రికాన్ని కొన‌సాగిస్తున్న రాయ‌ల్ ఫ్యామిలీ త‌మ కట్టుబాట్ల మేర‌కే నూత‌న రాజు లేదా రాణిని ఎంపిక చేసుకుంటుంది. ఇందుకు ప్ర‌ధాన అర్హ‌త మోనార్క్ హోదాలో వ్య‌వ‌హ‌రించిన వారికి ప్ర‌థ‌మ సంతాన‌మై పుట్టి ఉండ‌టం! ఎలిజ‌బెత్ కు అయినా, ఇప్పుడు ఆమె పెద్ద కొడుకు అయినా..  కేవ‌లం వారి పేరెంట్స్ కు ప్ర‌థ‌మ సంతానంగా పుట్ట‌డం అనే అర్హ‌త‌తోనే మోనార్క్ అయ్యారు!

మొన్న‌టి వ‌ర‌కూ పిన్స్ చార్లెస్ అనిపించుకున్న 73 యేళ్ల చార్లెస్ ఇప్పుడు కింగ్ చార్లెస్. ఆయ‌న త‌ర్వాత ఆయ‌న‌కూ – డ‌యానాకు పుట్టిన పెద్ద త‌న‌యుడు విలియ‌మ్స్ రాజ‌వుతాడు. ఆ త‌ర్వాత వారి పెద్ద కొడుకు రాజ‌వుతాడు! ఈ రాజ‌రికంలో పెద్ద కొడుకు లేదా పెద్ద కూతురు మాత్ర‌మే వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తారు. ఎలిజ‌బెత్ కు కూడా చార్లెస్ మాత్ర‌మే కాకుండా ఇత‌ర సంతానం ఉన్నారు. ఆమెకు ముగ్గురు పిల్ల‌ల్లో.. చార్లెస్ మాత్ర‌మే రాజ‌వుతాడు. మిగిలిన సంతానం రాయ‌ల్ ఫ్యామిలీనే కానీ, రాజ‌రిక హోదాలో వారికి ఉండ‌వు! 

శ‌తాబ్దాలు ఇలా ప్ర‌థ‌మ సంతానం మాత్ర‌మే రాజ‌రిక హోదాను పొంద‌డం, రెండో సంతానం, వారి కుటుంబాలు కేవ‌లం రాయ‌ల్ ఫ్యామిలీగా మాత్ర‌మే మిగిలిపోవ‌డం జ‌రుగుతోంది. వారి పేర్ల‌లో కూడా ప్ర‌థ‌మ సంతానానికి మాత్ర‌మే ప్రిన్స్ లేదా ప్రిన్సెస్ అనే ట్యాగ్ ఉంటుంది.  

ప్రిన్స్ చార్లెస్ పెద్ద కుమారుడి పేరు ముందు కూడా ప్రిన్స్ అని ఉచ్ఛ‌రిస్తారు. పెద్ద కుమారుడు మాత్ర‌మే ప్రిన్స్. రెండో కుమారుడికి ఆ హోదా ఉండ‌దు!  ఒక‌వేళ ఉన్నా.. పెద్ద వాడు రాజ‌య్యే వ‌ర‌కే. పెద్ద ప్రిన్స్ రాజ‌య్యి, సంతానాన్ని పొందితే.. అత‌డి సంతానం మాత్ర‌మే ప్రిన్స్, ప్రిన్సెస్ హోదాల‌ను పొందుతుంది. బ్రిట‌న్ రాజ్యాంగం అలిఖితం. సంప్ర‌దాయాలే చ‌ట్టాలు.  రాజ‌రికం కుటుంబం కూడా సంప్ర‌దాయాల‌కు అనుగుణంగా సాగిపోతోంది. 

సామంత‌ రాజుల‌తో హౌస్ ను ఏర్పర‌చ‌డంతో బ్రిటీష్ ప్రజాస్వామ్యాన్ని ఏర్ప‌రిచారు బ్రిట‌న్ మోనార్క్ లు. ఆ త‌ర్వాత కాల క్ర‌మంగా అందులో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్ర‌జాప్ర‌తి నిధుల‌తో పార్ల‌మెంట్ ఏర్ప‌డింది. ప్ర‌జ‌ల చేత ఎన్నుకోబ‌డిన ఎంపీలు ప్ర‌ధాన‌మంత్రిని ఎన్నుకుంటే, ఆ ప్ర‌ధాని కూడా రాణికి లేదా రాజు పేరిట పాల‌న‌ను సాగించ‌డం సంప్ర‌దాయంగా వ‌స్తోంది. రెండో ప్ర‌పంచ యుద్ధంలో బ్రిట‌న్ సంకీర్ణ కూట‌మిని విజేత‌గా నిలిపిన వాడిగా పేర్గాంచిన చ‌ర్చిల్ కూడా అంత‌టి క‌ష్ట‌స‌మ‌యంలో నాటి రాజు ఆరో జార్జి కి స‌మాధానాలు చెబుతూ వ‌చ్చాడు. ఎంత ప్ర‌ధాని అయినా చ‌ర్చిల్ కూడా ఆ రాజ్యంలో పౌరుడే! చ‌ర్చిల్ కు కూడా రాజు రాజే! 

ఈ సంప్ర‌దాయం ప‌ట్ల ఎంతో కొంత వ్య‌తిరేక‌త అయితే ఉంది. కానీ.. బ్రిటీష‌ర్ల‌కూ త‌మ సంప్ర‌దాయాలంటే గౌర‌వ‌మే! నామ‌మాత్ర‌పు రాజ‌రిక‌మే అయినా, దాన్ని వ్య‌తిరేకించే పార్టీలు, రాజ‌కీయ నేత‌లు కూడా అంతిమంగా రాణికి గౌర‌వాన్ని తెలిపే సంప్ర‌దాయాన్ని పాటిస్తారు! ఈ సంప్ర‌దాయంతో మార్పును కోరుకోవ‌డం లేదు బ్రిట‌న్ ప్ర‌జ‌లు. ఎలిజ‌బెత్ మ‌ర‌ణం త‌ర్వాత అక్క‌డ వ్య‌క్తం అవుతున్న నివాళే అందుకు సాక్ష్యం!