రాజకీయాలంటేనే విమర్శలు ప్రతివిమర్శలు, భజన కీర్తనలు, పొగడ్తలు. సాధారణంగా మంత్రులు తమ శాఖలను ఎంత సమర్ధంగా నిర్వహిస్తారో తెలియదుగానీ ముఖ్యమంత్రిని పొగుడుతూ భజన కీర్తనలు పాడటం, విమర్శలు చేసే ప్రతిపక్షాలను చీల్చి చెండాటం వీరి ప్రధానమైన కర్తవ్యం. ముఖ్యమంత్రులు కూడా ఆశించేది ఇదే. మంత్రులు సరిగా పని చేయకపోయినా క్షమిస్తారేమోగానీ ప్రతిపక్షాల మీద వీరంగం వేయకపోతే, నిప్పులు చెరగకపొతే మాత్రం ఊరుకోరు. మంత్రులు కూడా తాము ఎప్పుడూ సీఎం కనుసన్నల్లో ఉండాలని, ఆయన అనుగ్రహానికి పాత్రులు కావాలని, ఉన్న పదవిని కాపాడుకోవాలని, మళ్ళీ ఎన్నికల్లో టిక్కెట్ సంపాదించుకోవాలని, గెలిస్తే మంత్రి పదవి సంపాదించుకోవాలని ఆశిస్తుంటారు.
అందుకే తమకు ఇష్టమున్నా, లేకున్నా సీఎంను పొగుడుతారు. విపక్షాలను విమర్శిస్తారు. ఏపీ కేబినెట్ భేటీలో సీఎం జగన్ తన మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. దీనికి కారణం… విపక్షాలు తన భార్య వైఎస్ భారతిపై విమర్శలు చేస్తున్నా స్పందించకపోవడమే. గతంలోనూ ఇలాగే విపక్షాలు పలు అంశాలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నా మంత్రులు స్పందించకపోవడం పట్ల జగన్ అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం మంత్రులు మాట్లాడకపోవడం వల్ల రాజకీయంగా తనకు లేదా తన పార్టీ వైసీపీకి నష్టం జరుగుతుందని జగన్ భావిస్తున్నారు.
ఎక్కడో ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణాన్ని వైఎస్ భారతి, విజయసాయిరెడ్డికి అంటగడుతూ టీడీపీ చేసిన విమర్శలపై తన మంత్రులు స్పందించకపోవడమేంటని జగన్ వేసిన ప్రశ్న మంత్రుల్ని సైతం ఆలోచనలో పడేసింది. దీనిపై తాము స్పందించలేదంటూ జగన్ ప్రశ్నించిన తర్వాత మంత్రుల్లోనూ అంతర్మథనం సాగుతోంది. అయితే కేబినెట్ భేటీలో మంత్రులపై జగన్ అసహనం గురించి తెలిసిన తర్వాత వైసీపీ నేతలతో పాటు ఇతర పార్టీల్లోనూ ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది. వైఎస్ భారతి గురించి టీడీపీలో ద్వితీయశ్రేణి నేతలు చేసిన ఆరోపణలపై తాము స్పందించి ఉంటే ఈ వ్యవహారం మరో మలుపు తీసుకునేదన్న అభిప్రాయం ఎక్కువ మందిలో వ్యక్తమవుతోంది.
ముఖ్యంగా భారతిని వెనకేసుకొచ్చేలా తాము స్పందించి ఉంటే అది అంతిమంగా రాజకీయంగా పెద్ద చర్చకు తావిచ్చేదన్న అభిప్రాయం మంత్రులతో పాటు వైసీపీ నేతల్లోనూ వ్యక్తమవుతోంది. గతంలో జరిగిన పలు ఘటనల్ని వారు ఇందుకు ఉదాహరణగా గుర్తుచేస్తున్నారు. ఏపీలో గత మూడేళ్లుగా వైసీపీ, టీడీపీ మధ్య సాగుతున్న రాజకీయాన్ని దగ్గరి నుంచి చూసిన వారెవరికైనా ఓ అంశంలో మాత్రం పూర్తిగా క్లారిటీ ఉంది. అది ప్రత్యర్ధి పార్టీలు తమపై ఓ చిన్న విమర్శ చేసినప్పుడు దానికి వెంటనే రియాక్ట్ అయి ఖండన ఇవ్వడమో ఎదురుదాడి చేయడమో చేస్తే వారు తమ దాడిని మరింత ముమ్మరం చేయడం ఖాయం.
అధికారంలో ఉన్న పార్టీలకు అది మరింత తలనొప్పిగా మారడం మినహా ఎలాంటి ప్రయోజనం ఉండదు. గతంలో ఏపీలో దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసంతో పాటు మరికొన్నిఅంశాల్లో విపక్షాల విమర్శలకు మంత్రులు, వైసీపీ నేతలు స్పందించి వాటిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చకు కారణమయ్యారు. ఇప్పుడు కూడా భారతిపై చర్చకు తావిచ్చేలా తాము స్పందిస్తే ఇబ్బందులు తప్పవని మంత్రులు భావించి ఉండొచ్చన్న వాదన వినిపిస్తోంది. కానీ జగన్ మాత్రం ప్రత్యర్ధులకు సరైన కౌంటర్ ఇవ్వలేదనే ఆవేదనతో మంత్రులపై సీరియస్ అయ్యారు. మంత్రులుగా ఉన్నవారు ముఖ్యమంత్రికి రక్షణగా నిలబడాలి. రాజకీయ ప్రత్యర్థుల నుంచి వచ్చే విమర్శలను వారికన్నా ధీటుగా తిప్పి కొడుతుండాలి.
కానీ ఈ విషయంలోనే కొత్త మంత్రులు విఫలమవుతున్నట్లు వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఇతర నేతలకన్నా మంత్రులు చేసే విమర్శలకు ప్రాధాన్యం ఉంటుంది. వారి వాయిస్ బలంగా వినపడుతుంది. కానీ ఇప్పుడున్న మంత్రులెవరూ జగన్పై, జగన్ కుటుంబ సభ్యులపై తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్నదాడులను తిప్పి కొట్టలేకపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీఎం కూడా ఇదే అభిప్రాయంలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. మొదటి మంత్రివర్గంలో ఉన్న కొడాలి నాని, పేర్ని నాని ఇద్దరూ ముఖ్యమంత్రిపై ఈగ వాలనిచ్చేవారు కాదు. ప్రత్యర్థులు రెండు మాటలంటే.. వీరు నాలుగు మాటలనేవారు. మంత్రులుగా వీరి వాయిస్ కూడా మీడియాలో బలంగా వినిపించేది.
వీరిద్దరూ పదవులు కోల్పోవడంతో 5 నెలల నుంచి వైసీపీ తరఫున బలంగా వాయిస్ వినిపించేవారే లేరనే అభిప్రాయం పార్టీల్లోనే కాకుండా ప్రజల్లో కూడా వ్యక్తమవుతోంది. కొడాలి నాని, పేర్ని నాని విమర్శలకు టీడీపీ నేతలు సరైన రీతిలో సమాధానం చెప్పలేకపోయేవారే. దాంతో వీరిద్దరిదే పైచేయిగా ఉండేది. పరస్పర విమర్శలు చేసుకున్నప్పుడు వీరిదే పైచేయిగా ఉండేది. దీంతో టీడీపీపై వైసీపీ మెరుగ్గా ఉందనే భావన కూడా ప్రజల్లో వ్యక్తమయ్యేది. సామాజికవర్గాల వారీగా న్యాయం చేయాలనే భావనతో కొత్త మంత్రులను ఎంపిక చేశారు. వీరికి పదవులు కట్టబెట్టి ఐదు నెలలు దాటుతున్నప్పటికీ బలమైన గొంతుక వినిపించేవారే కరవయ్యారు. ఇటీవలి క్యాబినెట్ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి జగన్ వారిని ఇదే విషయమై నిలదీసినట్లు తెలుస్తోంది.
పాత మంత్రులు దాదాపు మూడు సంవత్సరాలు పదవుల్లో ఉన్నారు. నెల్లూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అనిల్ కుమార్ యాదవ్ లాంటివారు కూడా మంత్రి పదవి కోల్పోయిన తర్వాత మౌనం వహించారు. పాత మంత్రులను జిల్లాలకు వైసీపీ ఇన్ ఛార్జిలుగా నియమించడంతో వారు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. కొత్త మంత్రులు తమ శాఖలు, తమ నియోజకవర్గానికే పరిమితమవుతున్నారు. జగన్ పై, జగన్ కుటుంబ సభ్యులపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడానికి ఎవరూ ముందుకు రావడంలేదు.
కొత్త మంత్రుల్లో రోజా, దాడిశెట్టి రాజా, జోగి రమేష్ మాత్రమే తమ వాయిస్ ను వినిపించగలుగుతున్నారు. బలమైన వాయిస్ వినిపించడానికి కొందరు మంత్రులను మారుస్తున్నారంటూ వార్తలు వస్తున్న తరుణంలో సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారోననే ఉత్కంఠ రాజకీయవర్గాల్లో నెలకొంది.