ఆత్మ‌హ‌త్య‌లు ఆపేదెవ‌రు?

ఆత్మ‌హ‌త్య చేసుకున్న వాళ్లు ద‌య్యాలు అవుతార‌ని అంటారు. అదే నిజ‌మైతే సూసైడ్ చేసుకున్న నా స్నేహితులు ఒక్క సారైనా ద‌య్యాలుగా క‌నిపించాలి. ఎవ‌రూ క‌న‌ప‌డలేదు. ఆడ‌వాళ్లు ద‌య్యాలైతే ఎలా వుంటారో సినిమాల్లో చూశాం. కానీ…

ఆత్మ‌హ‌త్య చేసుకున్న వాళ్లు ద‌య్యాలు అవుతార‌ని అంటారు. అదే నిజ‌మైతే సూసైడ్ చేసుకున్న నా స్నేహితులు ఒక్క సారైనా ద‌య్యాలుగా క‌నిపించాలి. ఎవ‌రూ క‌న‌ప‌డలేదు. ఆడ‌వాళ్లు ద‌య్యాలైతే ఎలా వుంటారో సినిమాల్లో చూశాం. కానీ మ‌గ‌వాళ్లైతే ఎలా వుంటారో తెలియ‌దు.

సెప్టెంబ‌ర్ 10, ఆత్మ‌హ‌త్య‌ల నివార‌ణ దినం. సూసైడ్ నుంచి బ‌య‌ట ప‌డేయ‌డానికి మాన‌సిక శాస్త్ర‌వేత్త‌లు, డాక్ట‌ర్లు చాలా కాలంగా కృషి చేస్తూనే వున్నారు. కానీ ఆగ‌లేదు. ఎందుకంటే మ‌నుషులంద‌రికీ ఒకానొక సంద‌ర్భం వ‌స్తుంది. తాము ఒంట‌ర‌ని, ఎవ‌రూ ఆదుకోర‌ని, బ‌త‌క‌డం వృథా అనిపిస్తుంది. కొంద‌రు ఈ ఫీలింగ్ నుంచి బ‌య‌టికొస్తారు. కొంద‌రు వెళ్లిపోతారు.

నా చిన్న‌ప్పుడు ఒక డాక్ట‌రమ్మ వుండేది. ఆడ‌వాళ్ల‌కి ఎంతో ధైర్యం చెప్పేది. ఎంద‌రికో ప్రాణ‌దానం చేసింది. కానీ ఆవిడ ఉరి వేసుకుని చ‌నిపోవ‌డం నిజంగా షాక్‌. ఒక మిత్రుడు 14 ఏళ్ల వ‌య‌సులో పాయిజ‌న్ తాగాడు. అత‌ని తండ్రి ఓ మూర్ఖుడు. ఆ రోజుల్లో పిల్ల‌ల్ని చావ‌బాదితే బుద్ధిమంతుల‌వుతార‌నే న‌మ్మ‌కం. వాళ్ల‌కో పుస్త‌కాల షాపు వుండేది. 20 రూపాయ‌లు తేడా వ‌చ్చింద‌ని చిత‌క‌బాదాడు. తండ్రి మీద కోపంతో విషం తాగాడు. చావు బ‌తుకుల మ‌ధ్య ఉన్న‌వాడిని డాక్ట‌ర్ ద‌గ్గ‌రికి తెచ్చారు. బ‌త‌క‌లేదు. రోడ్డు మీద దుమ్ములో పొర్లి పొర్లి తండ్రి ఏడ్చాడు. వాళ్లు వీర‌శైవులు. శ‌వాన్ని పాడె మీద కూచోపెట్టి తీసుకెళ్తారు. ముక్కులో దూదితో, నిద్ర‌పోతున్న‌ట్టు వెళ్లిపోయాడు. ఇది జ‌రిగి చాలా ఏళ్లైనా ఆ దృశ్యం ఇప్ప‌టికీ క‌ల‌లో క‌నిపిస్తూ వుంటుంది. చ‌నిపోయిన మిత్రుడికి పాట‌లంటే ఇష్టం. ఘంట‌శాల గొంతు రేడియోలో వినిపిస్తే అక్క‌డే ఆగిపోయి మొత్తం విని, త‌న‌లో తాను పాడుకునే వాడు.

సినిమా వాళ్ల‌కి అన్నీ వుంటాయి. క‌ష్టాలే వుండ‌వ‌ని అనుకుంటారు. శోభ‌, సిల్క్‌స్మిత‌, ప‌టాప‌ట్ జ‌య‌ల‌క్ష్మి ఎందుకు చ‌నిపోయారు? కెరీర్ కోసం ఎంత క‌ష్ట‌ప‌డి వుంటారు? మెడ‌కి ఉరి తాడు పెట్టుకున్న‌పుడు ఆ సంఘ‌ర్ష‌ణ గుర్తు రాదా? ఎవ‌రి మీదో కోపం, ఇంకెవ‌రో ఏమో అనుకుంటార‌ని , అప్పులు తీర్చ‌క‌పోతే న‌వ్వుతార‌ని, ప‌రువు పోతుంద‌ని, ఫెయిల్ అయితే తిడ్తార‌ని అన్నీ కూడా మ‌నం క‌ల్పించుకున్న కార‌ణాలు, క‌ల్పిత ప్ర‌పంచం మాయ‌మైతే వ‌చ్చే న‌ష్ట‌మేమీ లేదు. కానీ ఆ స‌మ‌యంలో ధైర్యం చెప్పేవాళ్లు ఎవ‌రు?

చాప్లిన్ ఒక సినిమాలో ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించిన అమ్మాయితో “మ‌నుషులు జంతు ద‌శ నుంచి చైత‌న్యం కావ‌డానికి కొన్ని వేల ఏళ్లు ప‌ట్టింది. నువ్వెందుకు ఇంత చైత‌న్య శూన్య‌మైన ప‌ని చేశావ్‌?” అంటాడు.

16 ఏళ్ల క్రితం సాల్ట్ అండ్ పెప్ప‌ర్ షార్ట్ ఫిల్మ్ వ‌చ్చింది. న‌వాజుద్దీన్ , తేజ‌శ్వినీ కొల్హాపురి న‌టించారు. ప్రేమ విఫ‌ల‌మై ఆత్మ‌హ‌త్య చేసుకోబోతున్న అమ్మాయి ఇంట్లోకి ఒక వ్య‌క్తి ప్ర‌వేశిస్తాడు. ఉరి వేసుకోవ‌డం ఆపి అలికిడి విని అమ్మాయి హాల్లోకి వ‌స్తుంది. తాను దొంగ‌ను కాదు, ప‌ని కోసం సిటీకి వ‌స్తే దొర‌క‌లేదు, ఆక‌లిగా ఉంటే తిన‌డానికి ఏమైనా దొరుకుతుందేమోన‌ని వ‌చ్చానంటాడు.

ఆ అమ్మాయి జాలితో తినిడానికి ఏమైనా ఇస్తానంటుంది. ఫ్రిజ్ అంతా వెతికాను, ఏమీ లేదంటాడు. ద‌గ్గ‌ర‌లో వున్న పిజ్జా సెంట‌ర్‌కి ఫోన్ చేసి ఆర్డ‌ర్ పెడుతుంది.

పిజ్జా వ‌స్తుంది. దాని మీద మిరియాల పొడి చ‌ల్లితే, మిరియాల వాస‌న చూసి తాను తిన‌నంటాడు. అమ్మాయి ఆశ్చ‌ర్యంగా చూస్తుంది.

“మేము మిరియాల రైతులం. ప్ర‌భుత్వం మిరియాల దిగుమ‌తులు పెంచి, మా పొట్ట కొట్టింది. గిట్టుబాటు లేక మా అన్న ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ప్రేమ విఫ‌ల‌మై చ‌చ్చిపోలేదు. అన్నం లేక ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు”

“అయినా ఈ దేశంలో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోడానికి రైతులుండ‌గా, మ‌ళ్లీ మీరెందుక‌మ్మా” అని వెళ్లిపోతాడు.

మ‌న దేశంలో కొన్ని ల‌క్ష‌ల మంది రైతులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. చేసుకుంటున్నారు. ప్రేమ విఫ‌ల‌మై, మాన‌సిక జ‌బ్బుల‌తో  సూసైడ్ చేసుకున్న వాళ్ల‌కంటే వీళ్ల సంఖ్యే ఎక్కువ‌.

అన్నం పెట్టేవాడికి అన్నం లేదు. మ‌నం అన్నం తింటే అత‌ను పురుగుల మందు తింటున్నాడు. ఆ ఆత్మ‌హ‌త్య‌లు ఆప‌డానికి డాక్ట‌ర్లు, మాన‌సిక శాస్త్ర‌వేత్త‌లు అక్క‌ర్లేదు. పండిన పంట‌కి న్యాయ‌మైన ధ‌ర వ‌స్తే చాలు. (ఒక రోజు ఆల‌స్యంగా)

జీఆర్ మ‌హ‌ర్షి