
గతంతో పోలిస్తే నేటికి రాహుల్ ఇమేజ్ చాలా వరకూ పెరిగిందని అంటోంది ఎన్డీటీవీ సర్వే. సూటిగా చెప్పాలంటే దేశ ప్రజల దృష్టిలో ఇప్పుడు మోడీకి ప్రత్యామ్నాయం రాహుల్ మాత్రమే అని ఈ సర్వే కుండబద్ధలు కొడుతోంది. మోడీని కాదంటే.. ప్రధానిగా దేశ ప్రజల దృష్టిలో మరొకరు ఎవ్వరూ లేరని, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, కేసీఆర్.. ఇలా ఎవ్వరూ దేశ ప్రజల పరిగణనలో లేరని, మోడీ ప్రధానిగా ఉండాలని 43 శాతం మంది కోరుకుంటే, రాహుల్ కు ఈ సర్వేలో ఉన్న అనుకూలత 27 శాతం అని ఎన్డీటీవీ చెబుతోంది!
అయతే మోడీ- రాహుల్ ల మధ్యన వ్యత్యాసం చాలా ఉందనేది స్పష్టం అవుతున్న అంశం. ఇదే విషయంలో తాము 2019లో చేసిన సర్వేలో మోడీ అనుకూత 44 శాతం కాగా, రాహుల్ అనుకూలత 24 అని ఈ సంస్థే చెబుతోంది. అంటే దాదాపు నాలుగేళ్లలో మోడీ ఒక్క శాతం అనుకూలతను పోగొట్టుకోగా.. ప్రత్యామ్నాయంగా రాహుల్ మూడు శాతం ఆదరణను పెంచుకున్నాడు. ఇదీ ఎన్డీటీవీ సర్వే చెబుతున్న అంశం.
మూడు శాతం ఆదరణను పెంచుకోవడానికి రాహుల్ కు నాలుగేళ్లు పడుతోందంటే.. మరి 40 శాతం మంది మెప్పు పొందాలంటే ఇంకో పదేళ్లు పట్టొచ్చు.. ఈ లెక్కల ప్రకారం! అయితే.. ఇది కేవలం ఏడు వేల మంది ఇన్ పుట్స్ తో చేసిన సర్వే. కాబట్టి.. ఇది పెద్దగా ప్రామాణికం కాదు.
అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ కు ఊపొచ్చింది. తాము బీజేపీని ఓడించగలం అని కాంగ్రెస్ నమ్మగలుగుతోంది. బీజేపీని ఓడించడం ఇక కాంగ్రెస్ కు సాధ్యం కాదని అనుకున్న వారు కూడా.. బీజేపీ విపరీతంగా హిందుత్వ అజెండా చల్లిన చోట కాంగ్రెస్ విజయం సాధించిన వైనం పట్ల ఆశ్చర్యపోతున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గ్రాఫ్ పెరిగిందని కచ్చితంగా చెప్పొచ్చు. అయితే.. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం వెనుక మూలాలను మరిచిపోతే కాంగ్రెస్ పరిస్థితి షరా మామూలుగానే మిగలవచ్చు.
స్థానిక నేతల శక్తి యుక్తులతోనే కర్ణాటకలో కాంగ్రెస్ నెగ్గింది తప్ప.. సోనియా పేరుతోనో, రాహుల్ పేరుతోనే కాదు. విబేధాలను పక్కన పెట్టి విజయం కోసం సిద్ధరామయ్య- డీకే శివకుమార్ లు పని చేశారు. ఎంతో కొంత ఖర్గే కూడా పని చేశారు. ఫలితంగానే కాంగ్రెస్ కు విజయం దక్కింది. ఇందులో రాహుల్ కు స్పష్టమైన సందేశమే ఉంది. స్థానిక నాయకత్వాన్ని నిర్వీర్యం చేయడం వల్లనే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ గల్లంతయ్యింది.
అంతా తామే, అంతా తమ వల్లనే అని సోనియా- రాహుల్ విపరీతంగా నమ్మారు. పీసీసీ ప్రెసిడెంట్లను, ముఖ్యమంత్రి పదవి ఆశావహులను జోకర్లలా చూశారు. దీంతో గత పదేళ్లలో కాంగ్రెస్ వేగంగా పతనం అయ్యింది. స్థానిక నేతల ఛరిష్మా, ఇమేజ్ ఆ పార్టీని కర్ణాటకలో కాపాడింది. ఇదే తరహాలో.. గేమ్స్ ను కట్టిపెట్టి స్థానిక నేతలకు వీలైనంత సహకారం ఇస్తే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ నిలదొక్కుకునే అవకాశం ఉంది.
తన నాయకత్వం నిలవాలంటే.. స్థానిక నాయకత్వాన్ని నిలబెట్టాలని రాహుల్ కు కర్ణాటక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. మరి ముందున్న తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల విషయంలో కూడా ఇలాంటి నాయకత్వ తగవులున్నాయి. వాటిని సవ్యంగా పరిష్కరించడం రాహుల్ కు తక్షణం ఉన్న కఠిన పరీక్ష. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఈ సారి విజయాలు సాధిస్తే మాత్రం.. రాహుల్ గాంధీ రైజింగ్ చాప్టర్ మొదలైనట్టే!
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా