జార్ఖండ్ రాష్ట్రంలోని సాహిబ్ గంజ్ జిల్లాలో 22 ఏళ్ల యువతి హత్యకు గురైంది. ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలు చేశారు. ఢిల్లీలో జరిగిన శ్రద్ధావాకర్ హత్య కేసు తరహాలోనే ఇది కూడా జరిగింది. అయితే ఇక్కడ హంతకుడు ఆమె భర్త కాదు, భర్త కుటుంబీకులు.
ఇప్పటివరకు పోలీసులు 18 శరీర భాగాల్ని స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలి భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యులు కొందర్ని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించినట్లు అనుమానిస్తున్న కొన్ని ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడిని దిల్దార్ అన్సారీగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాధితురాలు నిందితుడికి రెండో భార్య. దిల్దార్ అన్సారీ రెండో పెళ్లికి మొదటి భార్య అభ్యంతరం చెప్పడంతో, కుటుంబసభ్యులంతా కలిసి ఈ హత్య చేశారు. నిందితుడి కుటుంబీకులు ఆమెను హత్య చేసినట్లు అంగీకరించారు.
బాధితురాలు రూబికా పహాడిన్ను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేసి వేర్వేరు ప్రదేశాల్లో పడేశారు. బోరియో సంతాలి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ కేంద్రం వెనుక మనిషి కాలు కనిపించడంతో ఈ హత్య బయటపడింది. మరింత లోతుగా విచారించగా, మిగిలిన శరీర భాగాలు బయటపడ్డాయి.